YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

కౌలు రైతుల కష్టాలు ఇంతింతకాదయా

కౌలు రైతుల కష్టాలు ఇంతింతకాదయా

పచ్చని పంటలతో కళకళలాడిన ఆ ఊళ్లలో ఎప్పుడూ చేతినిండా పని ఉండేది. పనికోసం బయటకు వెళ్లాల్సిన పనేలేదు. ఇక్కడే పదిమందికి కూలి పనులు చూపెట్టేవారు. అంతేకాదు రాయలసీమ గ్రామాల నుంచి కూలీలను పత్తి, మిరప కోతలకు తీసుకొచ్చేవారు. వేలమందికి ఉపాధి దొరికేది. ఇక్కడున్న కొద్దిపాటి భూమితోపాటు కొంత కౌలుకు తీసుకుని సాగుచేసుకుంటూ చిన్నచిన్న రైతులు కూడా మరో పది మందికో, ఇరవై మందికో ఉపాధి చూపించేవారు. బయటకు వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే పని ఉండేది. అలాంటిది ఇప్పుడు పని కోసం వెతుక్కోవాల్సి వస్తోంది.


ఎకరం, అరెకరం లోపు ఉన్న రైతులు ఎక్కువమంది పూలింగు సమయంలోనే భూములు అమ్ముకున్నారు. ఉండటానికి ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు పనీలేదు. పొలమూ లేదు. కూలి పనులూ లేవు. పనుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రతిరోజూ వెలగపూడి, తుళ్లూరు, అనంతవరం, నెక్కల్లు, ఐనవోలు తదితర గ్రామాల నుంచి సుమారు 50కిపైగా ఆటోలు, పదికిపైగా ట్రాక్టర్లలో కూలీలు పాత అమరావతి ప్రాంతాలకు పనుల కోసం వెళుతున్నారు. ఆయా గ్రామాల్లో సెంటర్లలో ఉదయం ఏడు గంటల నుంచే కూలీల కోసం ఆటోలు బారులు తీరి కనిపిస్తున్నాయి. గతంలో ఇక్కడే రోజుకు రూ.450 నుంచి రూ.700 వరకూ సంపాదించేవారు ఇప్పుడు ఇక్కడ్నుంచి బయట ప్రాంతాలకు తక్కువ కూలికి వెళ్తున్నారు. ప్రతిరోజూ ఉదయం బయలుదేరి వెళ్లడం, ఏ ఊరిలో పనిదొరికితే ఆ ఊరిలో చేసుకుని సాయంత్రానికి తిరిగి రావడం ప్రజల దినచర్యగా ఉంది. వచ్చే కూలి డబ్బుల్లోనే ఆటో ఛార్జి కూడా చెల్లించాలి. గతంలో ఇక్కడే పనిచేసుకునే రోజుల్లో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా విజయవాడో,

గుంటూరో వెళ్లి చూపించుకుని వచ్చేవారు. ప్రస్తుతం డాక్టర్‌ ఫీజు కోసమే వెతుక్కోవాల్సి వస్తోంది. వచ్చిన కూలి డబ్బులు తినడానికి సరిపోతున్నాయి. ఇక చిన్నచిన్న ముచ్చట్లు తీరడం లేదని చిన్న రైతు కె.నాగేశ్వరరావు తెలిపారు. ఇతను వెలగపూడి నుంచి రోజూ కూలి పనులకు పాత అమరావతి అవతలి గ్రామాలకు వెళుతున్నారు. పిల్లలకు స్కూల్స్‌ లేకపోవడంతో వారిని కూడా కూలికి తీసుకెళ్తున్నారు. ఇంతకుముందు ఇంట్లో భార్యాభర్తలు మాత్రమే పనిచేసేవారు. ఇప్పుడు ఇంటిల్లిపాదీ పనిచేసుకోవాల్సి వస్తోంది. ఇక్కడ పొలాలు లేనివారికి ప్రభుత్వం నెలకు రూ.2500 పెన్షన్‌ ఇస్తోంది. ఇటీవల వారి ఆధార్‌ నెంబర్లతో వేరేచోట్ల భూములున్నాయని చెప్పి వారికి పెన్షన్లు ఇవ్వడం మానేశారు. అదేమంటే భూమిలేదని నిరూపించుకోమంటున్నారు. తమకు భూమిలేదని చెప్పుకోవడం కోసం పంచాయతీ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వారాలు, నెలలు తరబడి తిరిగినా సమస్యలు పరిష్కారానికి నోచడం లేదు. దీంతో అటు రూ.2500 కూడా అందడం లేదు.

Related Posts