YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

ఆళ్ల నానికి ఎదురుదెబ్బలు

ఆళ్ల నానికి ఎదురుదెబ్బలు

ఏపీ డిప్యూటీ సీఎం, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానిపై సొంత పార్టీ కేడ‌ర్‌లోనే తీవ్రమైన వ్యతిరేక‌త వ్యక్తమ‌వుతోంది. జ‌గ‌న్‌కు అత్యంత ఆప్తుడిగా పేరున్న ఆళ్ల నాని 2014 ఎన్నిక‌ల్లో ఓడినా జ‌గ‌న్ న‌మ్మకం ఉంచి జిల్లా పార్టీ ప‌గ్గాలు ఇవ్వడంతో పాటు ఎమ్మెల్సీని చేశారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నానిని కాద‌ని ఏలూరు ఇన్‌చార్జ్‌గా మాజీ మునిసిప‌ల్ చైర్‌ప‌ర్సన్ మ‌ధ్యాహ్నపు ఈశ్వరీ బల‌రామ్‌కు ఇచ్చిన‌ప్పటికి ఎన్నిక‌ల చివ‌ర్లో మాత్రం మ‌ళ్లీ ఆళ్ల నానికే సీటు ఇవ్వగా జ‌గ‌న్ ప్రభంజ‌నంలోనూ 3 వేల పైచిలుకు ఓట్ల అత్తెస‌రు మెజార్టీతో మాత్రమే ఆళ్ల నాని విజ‌యం సాధించారు.ఆళ్ల నానికి మంత్రి ప‌ద‌వి వ‌స్తుందా ? రాదా ? అన్న సందేహాలు ఉన్నా జ‌గ‌న్‌కు ముందు నుంచి న‌మ్మక‌మైన వ్యక్తిగా ఉండ‌డంతో పాటు సామాజిక స‌మీక‌ర‌ణ‌లు ఆయ‌న‌కు క‌లిసొచ్చాయి. వాస్తవానికి జిల్లా కేంద్రంగా ఉన్న ఏలూరులో ఎన్నో స‌మస్యలు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో ఎంతో మంది పేద‌ల‌కు, పేట‌ల‌కు మౌలిక సౌక‌ర్యాలు కూడా లేవు.

 

 ఆళ్ల నాని మంత్రి కావ‌డంతో త‌మ స‌మ‌స్యలు ప‌రిష్కారం అయిపోయిన‌ట్టే అనుకున్న వారంద‌రికి పెద్ద షాకే త‌గులుతోందంటున్నారు.మంత్రిగా ఉన్న ఆయ‌న ప్రజ‌ల‌కు కాదు క‌దా.. క‌నీసం పార్టీ కేడ‌ర్ లో ద్వితీయ‌, తృతీయ శ్రేణి వాళ్లకు కూడా అందుబాటులో ఉండ‌డం లేదంటున్నారు. ఆళ్ల నానికి బాగా కావాల్సిన ఓ ఏడెనిమిది మంది నేత‌ల‌కు మిన‌హా మిగిలిన వారికి ఆయ‌న ద‌ర్శన‌భాగ్యం క‌ల‌గ‌డం లేద‌ని ఆ పార్టీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు. మా మంత్రి సీఎంకు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. ప్రజ‌ల‌కు ఆయ‌న్ను చూసే అదృష్టం కూడా లేద‌ని సొంత పార్టీ నేత‌లే ఏలూరులో చ‌ర్చించుకుంటున్నారు. ఆళ్ల నాని మంత్రిగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిలో ప్రత్యేకంగా ఆయ‌న ముద్రంటూ లేకుండా పోయింది.ఇక ఆళ్ల నాని దిన‌చ‌ర్యే ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు ప్రారంభం కాద‌ని.. ఆయ‌న సాయంత్రం అయితే ప్రజ‌ల‌కు అందుబాటులో ఉండ‌ర‌ని ఏలూరు ప్రజానీకం చెపుతోంది. సో ఈ లెక్కన చూస్తే మంత్రిగా ఆయ‌న ప‌ర్యట‌న‌ల‌కు, ఇత‌ర‌త్రా స‌మావేశాల‌కు మిన‌హా ప్రజ‌ల‌ను క‌లుసుకునే స‌మ‌యం త‌క్కువేన‌ని స్పష్టంగా తెలుస్తోంది. సొంత పార్టీ కేడ‌ర్‌కే అందుబాటులో లేని నేత ఇక సామాన్య ప్రజ‌ల‌కు ఎంత స‌మ‌యం ఇస్తారు ? వారికి ఆయ‌న్ను క‌లిసే స‌మ‌యం ఉంటుందా ? అన్నది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌..?


ఆళ్ల నాని తీరు మార్చుకోక‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు విజ‌యావ‌కాశాలు క‌ష్టమే అన్న టాక్ కూడా ఏలూరులో వ‌చ్చేసింది. వాస్తవానికి గ‌త ఎన్నిక‌ల్లోనూ ఆళ్ల నాని ఓట‌మి నుంచి తృటిలో భ‌య‌ట‌ప‌డ్డారు. అప్పటి వ‌ర‌కు నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే బ‌డేటి బుజ్జి విజ‌యం ఖాయం అనుకున్న టైంలో జ‌గ‌న్ వేవ్‌కు తోడు చివ‌ర్లో ఏలూరులో స‌మీక‌ర‌ణ‌లు మార‌డంతోనే ఆళ్ల నాని గ‌ట్టెక్కారు. అప్పటి వ‌ర‌కు టీడీపీ మేయ‌ర్‌గా ఉన్న ఎస్ఎంఆర్ పెద‌బాబు వైసీపీలోకి రావ‌డంతో ఆ వ‌ర్గం నాని గెలుపున‌కు శ్రమించింది. అలాగే కోట‌గిరి శ్రీథ‌ర్ ఎంపీ క్యాండెట్ అవ్వడంతో పాటు దివంగ‌త మాజీ మంత్రి కోట‌గిరి వ‌ర్గం, ఎంఆర్డీ బ‌ల‌రాం లాంటి నేత‌లంతా శ్రమించినా నాని 3 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో మాత్రమే గ‌ట్టెక్కారు.అయితే ఇప్పుడు ఆళ్ల నానికి పూర్తి అనుకూల‌మైన ప‌రిస్థితి ఏలూరులో ఎంత మాత్రం లేద‌న్నది నిజం. మంత్రిగా ఉన్న నేత కేవ‌లం ముఖ్యమంత్రికో, అధికారుల‌కో న‌లుగురైదుగురు నేత‌ల‌కో అందుబాటులో ఉంటే స‌రిపోద‌ని... నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌కు అందుబాటులో లేక‌పోతే మ‌హామ‌హులు మ‌ట్టిక‌రిచిన ప‌రిస్థితే ఆళ్ల నాని కూడా ఎదుర్కోక త‌ప్పద‌న్నదే స్థానిక రాజ‌కీయ ప‌రిస్థితులు చెపుతున్నాయి. మ‌రి ఆళ్ల నాని తీరు మారుతుందో ? లేదో ? చూడాలి.

Related Posts