న్యాయవ్యవస్థ వ్యాఖ్యలు, నియామకాలు, బదిలీలకు నిగూడార్థం ఉంటుంది. వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ రంగంలోని నిపుణులు, అవగాహన గల వ్యక్తులకు తప్ప అన్యులకు ఒక్క పట్టాన అర్థమవదు. అర్థం చేసుకుంటే సంబంధిత నిర్ణయం వెనక గల లోతుపాతులు తెలిసివస్తాయి. కొన్ని విషయాలు పైకి సాధారణంగా కనపడతాయి. వాటి వెనక ఎంతో విషయం ఉంటుంది. అందులో ఎన్నో విషయాలు ఇమిడి ఉంటాయి. న్యాయవ్యవస్థకు సంబంధించి ఇటీవల జరిగిన కొన్ని బదిలీలు, నియామకాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు మరీ ముఖ్యంగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి బదిలీ న్యాయవర్గాల్లో సంచలనం కలిగించింది.జస్టిస్ మహేశ్వరి ఏపీ నుంచి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ కావడం ఆశ్చర్యం కలిగించింది. అక్కడి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోస్వామి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఈ రెండు బదిలీలు ఆయా హైకోర్టుల ప్రాధాన్యాతలను తెలియజేస్తున్నాయి. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహేశ్వరి వ్యవహారశైలి బదిలీకి గల కారణాల్లో ఒకటన్న వాదన న్యాయవాద వర్గాల్లో వినిపిస్తోంది. దేశంలో ప్రతిష్ట్మాతక, అతిపెద్ద హైకోర్టుల్లో ఒకటిగా పరిగణించే ఏపీ నుంచి అతి చిన్న, అంతగా ప్రాధాన్యం లేని సిక్కిం హైకోర్టుకు ఆయన బదిలీ అయ్యారు.1975 మే 16న ప్రారంభమైన సిక్కిం హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులే పని చేస్తుంటారు. ప్రస్తుతం అక్కడి ప్రధాన న్యాయమూర్తి తో పాటు జస్టిస్ మీనాక్షి మదన్ రాయ్, జస్టిస్ భాస్కర్ రాజ్ ప్రధాన్ విధులు నిర్వర్తిస్తున్నారు. మదన్ రాయ్ మహిళా న్యాయమూర్తి. సిక్కిం హైకోర్టుకు వచ్చే రోజువారీ కేసులు, అప్పీళ్లు, రిట్ పిటిషన్లు తక్కువే. ఇతర హైకోర్టుల మీద చూసుకుంటే బాగా తక్కువ. సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.డి.దినకరన్ ను సుప్రీంకోర్టు 2011 జులైలో నియమించింది. అప్పటికే ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దినకరన్ బదిలీ న్యాయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అవినీతి ఆరోపణల కారణంగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తి నుంచి అంతగా ప్రాధాన్యం లేని సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయనను బదిలీ చేశారన్న అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. సిక్కిం హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా జస్టిస్ దినకరన్ బదిలీపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలో పని చేయడానికి అర్హులు కానివారు సిక్కింలో ఎలా అర్హులు అవుతారని ప్రశ్నించింది.ఈ నేపథ్యంలో ఏపీ నుంచి సిక్కిం కు జస్టిస్ మహేశ్వరి బదిలీపై న్యాయవర్గాల్లో లోతైన చర్చ జరుగుతోంది. ఏపీ హైకోర్టు పరిధి చాలా పెద్దది. ప్రాధాన్యం కూడా ఎక్కువే. ఈ హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 37. వీరిలో 28 మంది శాశ్వత, 9 మంది అదనపు న్యాయమూర్తులు. ప్రస్తుతానికి పూర్తిస్థాయిలో న్యాయమూర్తుల నియామకం జరగలేదు. ఇంత పెద్ద సంఖ్యలో న్యాయమూర్తులకు నాయకత్వం వహించడం అరుదైన, ప్రత్యేకమైన గౌరవం. ప్రధాన న్యాయమూర్తి పదవి ఎక్కడైనా ఒక్కటే అయినప్పటికీ పెద్ద హైకోర్టుల్లో పని చేయడం గౌరవంగా ఉంటుంది. ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఉమ్మడి ఏపీ 2014లో విడిపోయినప్పటికీ చాలాకాలం పాటు తెలుగు రాష్టాలకు హైదరాబాద్ లోని హైకోర్టు ఇక్కడి కేసులను విచారించింది. 2019 జనవరి ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడు గ్రామంలో ఏపీ హైకోర్టు ప్రారంభమైంది. 13 మంది న్యాయమూర్తులతో ప్రారంభమైన ఈ హైకోర్టుకు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. తరవాత పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి గా మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి వచ్చారు.