పవన్ కల్యాణ్ ఆ ముద్ర నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ప్యాకేజీ తీసుకున్న నేతగా ఆయనపై చేస్తున్న విమర్శలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. నిజానికి పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడా? లేదా? అన్నది పక్కన పెడితే యాధృచ్ఛికంగా జరిగిందో? లేదో? తెలియదు కాని ఆయన వ్యవహారం చూస్తే అనుమానం కలగక మానదు. పవన్ కల్యాణ‌్, నారా లోకేష్ ఒకే అంశంపై పర్యటనలు చేయడం ఇందుకు మరింత ఊతమిచ్చింది. విమర్శలకు మరింత తావిచ్చింది.రైతు సమస్యలపై పవన్ కల్యాణ్ మచిలీపట్నం పర్యటన చేపట్టారు. నివార్ తుపాను బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలన్నద ఆయన ప్రధాన డిమాండ్. కానీ నివార్ తుపాను వచ్చిన సందర్భంలోనే ముఖ్యమంత్రి జగన్ డిసెంబర్ 31వ తేదీ లోగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీలో కూడా జగన్ ఇదే విషయాన్ని చెప్పారు. కానీ నష్టపరిహారం చెల్లించడానికి ఒకరోజు ముందు పవన్ కల్యాణ్ మచిలీపట్నం వచ్చి కలెక్టర్ కు వినతి పత్రం అందించడం చర్చనీయాంశమైంది.ఇక రైతు సమస్యల కోసం వచ్చిన పవన్ కల్యాణ్ ను ప్యాకేజీ తీసుకునే వచ్చారని ముఖ్యమంత్రి జగన్ దగ్గర నుంచి మంత్రుల వరకూ అందరూ విమర్శించారు. పవన్ కల్యాణ్ పర్యటన కాకతాళీయంగా జరిగినప్పటికీ ఆయన పై ప్యాకేజీ ముద్రను వైసీపీ నేతలు బలంగా వేస్తారు. తిరుపతి ఎన్నికల్లోనూ పవన్ కల్యాణ్ పోటీ చేస్తామని చెప్పడం వెనక టీడీపీకి పరోక్షంగా మద్దతు ఇవ్వడం కోసమేనని వైసీపీ నేతలు చెబుతున్నారు. తిరుపతిలో టీడీపీ సెకండ్ ప్లేస్ లో ఉండాలన్నది పవన్ కోరికంటున్నారు.
పవన్ కల్యాణ్ టీడీపీ నుంచి విడిపోయి బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆయనపై తెలుగుదేశం పార్టీ అనుకూల ముద్ర మాత్రం చెరిిగి పోలేదు. పవన్ కల్యాణ్ పరిస్థితి చూస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని వెళ్లాలని గట్టిగా భావిస్తున్నట్లు సమాచారం. అయితే అందుకు ఇంకా సమయం ఉందని, పవన్ కల్యాణ్ ప్రస్తుతానికి బీజేపీతోనే కలసి వెళ్లే ఆలోచనలో ఉన్నారని జనసేన పార్టీ నేత ఒకరు చెప్పారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏ పర్యటన చేపట్టిన ఆయనపై ప్యాకేజీ ముద్ర మాత్రం చెరిగి పోవడం లేదు.