YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

సోషల్ మీడియాకు పెరుగుతున్న మద్దతు

సోషల్ మీడియాకు పెరుగుతున్న మద్దతు

క్రైమ్, సెక్స్, హింస కనిపిస్తే  మీడియా చెలరేగిపోతోంది. వాటిని టీఆర్పీ పాయింట్లుగా మార్చుకోవాలని మీడియా ఆవేశపడుతోంది. ఆయాస పడుతోంది. ఇదంతా నిన్నామొన్నటివరకూ జరిగిన కథ. తాజా కథ బ్రోకరేజీ చేస్తూ కమీషన్ కోసం ఏ పనైనా చేసి పెట్టే తాబేదారుగా మారింది. వ్యవస్థల్లోని లోపాలు పెచ్చరిల్లడానికి ప్రధాన వాహకంగా పెరిగి పెద్దదైపోతోంది. మీడియా పేరు చెబితే ప్రజలు ఛీకొట్టే పరిస్థితి. ప్రభుత్వాల చేతిలో చులకన. రాజకీయపార్టీలు కేవలం తైనాతీలుగా గుర్తిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా విజృంభిస్తోంది. ఒక వార్తను సమాజం ముందు తొట్టతొలుత బయటపెడుతోంది సామాజిక మాధ్యమాలే. అనేక రకాల కోణాలను కూడా ఈ సామాజిక సారథులు చర్చకు పెడుతున్నారు. ప్రధాన స్రవంతి మీడియా తరహాలో ఏకపక్ష, ఒంటెత్తు పోకడలు కాకుండా భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యే అవకాశమూ కల్పిస్తున్నారు. అన్నిటినీ గమనించిన తర్వాత ప్రజలే సొంతంగా ఒక నిర్ణయానికి రావడానికి ఆస్కారం ఏర్పడుతోంది. అదే మెయిన్ స్ట్రీమ్ మీడియా తమ అభిప్రాయాలను బలవంతంగా ప్రజలపై రుద్దుతోంది. ప్రజలు ఇంతవరకూ నమ్ముతూ వచ్చారు. దానికి కారణం దాని మూలాలు. తొలుత స్వాతంత్ర్యోద్యమానికి అండగా నిలవడం, ఆతర్వాత కాలంలో ప్రజాసమస్యలపై స్పందించడం, అవినీతికి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించిన జర్నలిస్టుల త్యాగాలు ప్రధానస్రవంతి మీడియాకు ఒక పవిత్రతను ఆపాదించాయి. ఆ వెలుగు వెనక చీకటి వ్యవహారాలు ఎంతగా నడిపినా ఇంతకాలం గడిచిపోయింది. ఇప్పుడు ఆ వెలుగు మసకబారుతోంది. దాని వెనక ఉన్న చీకటి కోణాలు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీడియా ముసుగు తొలగిపోతోంది. అత్యంత శక్తి సంపాదించిన భస్మాసురుడు తనకు ఎదురులేదని విర్రవీగి తనను తానే భస్మం చేసుకున్నట్లుగా స్వీయాపరాధాలతో మీడియా తనను తాను హననం చేసుకుంటోంది.

ఈమధ్య కాలంలో మీడియా మీద పడినన్ని మరకలు ఏ రంగంపైనా కనిపించవు. వార్తల వక్రీకరణ, అనవసర ప్రచారం, తమ అనుకూల పార్టీ, వ్యక్తికి మద్దతు కూడగట్టేందుకు సర్వజనసమ్మతి నిర్మాణం వంటి పనుల్లో చాలా ప్రసారమాధ్యమాలు మునిగితేలుతున్నాయి. ప్రజాశ్రేయస్సు అన్న మాటను కట్టిపెట్టి పైసలు దొరికితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. సమాజం, ప్రజల కోసమని ముసుగు వేసుకున్న చానళ్ల నిజస్వరూపం వారు ప్రసారం చేస్తున్న వార్తల సాక్షిగా బట్టబయలయిపోతోంది. అయినా నిస్సిగ్గుగా బరితెగిస్తున్నాయి. ఈ ధోరణిని ఊహించి ఉంటే రాజ్యాంగం, చట్టంలో కనీస నియంత్రణలను మన జాతి నిర్మాతలు కచ్చితంగా ఏర్పాటు చేసి ఉండేవారు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిగా పెరిగిన మీడియా ఇంత నీచంగా వ్యవహరిస్తుందని వారూహించలేదు. మనిషి బలహీనతలే పెట్టుబడిగా ఆడుకుంటున్నాయి ప్రసార సంస్థలు. సొమ్ము చేసుకుంటున్నాయి. అమ్మాయి కనిపిస్తే ..అక్రమ సంబంధం ఊసు వినిపిస్తే చాలు చిలువలుపలవలు చేర్చి కథనాలు ప్రసారం చేసి క్యాష్ చేసుకుంటున్నాయి. దీనిని అడ్డుకునేవారు, మంచి చెప్పేవారు కరవయ్యారు. ఒకవేళ ఎవరైనా ఏదైనా అంటే మీడియా స్వేచ్ఛకు భంగకరమంటూ పైపై ఆందోళనలతో భగ్గుమనిపిస్తున్నారు. ఫిల్మ్ ఆర్టిస్టు శ్రీరెడ్డి ఉదంతమే ఇందుకు నిదర్శనగా చూడాలి. ఆమె సమస్యపై మీడియాకు ఎటువంటి ఆసక్తి లేదు. అందులోని మసాలాపైనే దృష్టి. సినిమా కళాకారిణులు అవకాశాల కోసం పడకింటికి వెళ్లాలన్న ధోరణిలో పూర్తిస్థాయి చర్చలతో శృంగారోపేతం చేసేశారు చానళ్లను. తిట్లు,దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇందులో వేడిని పెంచే ముడిసరుకులుగా వాడుకున్నారు. క్యాస్టింగ్ కౌచ్ కథ రెండు ప్రధాన రాజకీయ పార్టీల పోరాట వేదికగా టర్న్ తీసుకుంది. జర్నలిజం జావగారిపోయింది.

Related Posts