YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం విదేశీయం

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై సందిగ్ధత - మరోసారి ఓట్ల లెక్కింపు

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై సందిగ్ధత - మరోసారి ఓట్ల లెక్కింపు

పోలింగ్‌లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఒకసారి.. ఓట్లను పెంచి త‌న‌నే విజేత‌గా ప్రకటించాలంటూ ఓ అధికారితో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడ‌టంతో.. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై సందిగ్ధత ఏర్పడింది. మరో 14 రోజుల్లో కొత్త అధ్యక్షుడు అధికార పీఠం అధిష్ఠించనున్న తరుణంలో అధ్యక్ష ఎన్నిక ఓట్లను మరోసారి లెక్కించనున్నారు. ఇది కూడా అమెరికాలో కొంత ఆందోళనకు గురిచేస్తున్నది. అసలింతకీ ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు లెక్కించాల్సిన అవసరం ఏమిటి? ఒకవేళ గతంలో సాధించిన వాటికన్నా భిన్నంగా ఓట్లు పోల్‌ అయితే ఏంచేయాలి? ఇద్దరు అభ్యర్థులకు సరిసమానంగా ఓట్లు పోల్‌ అయినపక్షంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇవాళ ప్రకటించే ఫలితాన్నే ప్రామాణికంగా తీసుకుంటారా? లేదా మార్పులు ఏవైనా ఉంటాయా? ఇలాంటి ఎన్నో సందేహాలు సాధారణ పౌరుడి మదిని తొలిచేస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3 న జరిగాయి. ఎలక్టోరల్ కాలేజీ ఓటింగ్ డిసెంబర్ 14 న జరిగింది. జో బైడెన్‌ 306 ఓట్లు, డొనాల్డ్‌ ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చాయి. అయితే, పలు రాష్ట్రాల్లో రిగ్గింగ్‌ జరిగిందని, ఫలితంగా తనకు తక్కువ ఓట్లు వచ్చాయని ట్రంప్‌ పేచీ పెట్టారు. ఒకానొక దశలో ఆయన గెలుపును పట్టించుకునేది లేదని, వైట్‌హైస్‌ను వదిలివెళ్లబోనంటూ ట్రంప్‌ తన అనుచరుల వద్ద చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 20 కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ప్రమాణం స్వీకరించే సమయాన ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు లెక్కించాలని అమెరికా ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. లెక్కింపు అనంతరం అధ్యక్షుడిగా గెలిచిన వ్యక్తి పేరును అధికారికంగా మరోసారి ధ్రువీకరిస్తారు. అధ్యక్షుడిగా ప్రమాణం చేసే రోజునే ఇనాగురేషన్‌ అని కూడా పిలుస్తుంటారు. అనంతరం సెనేట్‌, ప్రతినిధుల సభ సంయుక్తంగా సమావేశం జరుగుతుంది. దీనికి ప్రస్తుత ఉపాధ్యక్షుడైన మైక్‌ పెన్స్‌ అధ్యక్షత వహిస్తారు.
సంయుక్త సమావేశం ఇలా..
సెనేట్‌లో 100 మంది సభ్యులు ఉండగా.. ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులు కూర్చుంటారు. సంయుక్త సమావేశం ప్రతినిధుల సభ భవనంలో జరుగుతుంది. నవంబర్ 3 న జరిగిన అధ్యక్షుడి ఎన్నికతోపాటు ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులు, సెనేట్‌లో మూడో (33) వంతు సభ్యులు కూడా ఎన్నికయ్యారు. కొత్త అధ్యక్షుడి ప్రమాణం స్వీకారానికి ముందు ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఇది రాజ్యాంగబద్ధంగా దేశ కాబోయే అధ్యక్షుడి పేరును ప్రకటిస్తుంది. సంయుక్త సమావేశానికి ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అధ్యక్షత వహిస్తారు. ప్రతి రాష్ట్ర బ్యాలెట్ పెట్టెలు అక్షర క్రమంలో తెరుస్తారు. ఏ అభ్యర్థికి ఎవరు ఓటు వేశారో వెల్లడిస్తూ లెక్కింపు ప్రక్రియను పూర్తిచేస్తారు. ఒకవేళ పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులు ఇద్దరికీ సమానంగా 269-269 ఓట్లు వచ్చినట్లయితే.. పార్లమెంటు కంటింజెంట్‌ ఎన్నికలను నిర్వహిస్తారు. దీనికి కూడా ఒక పద్ధతి  ఉన్నది. అధ్యక్షుడి ఎన్నికలను ప్రతినిధుల సభ, ప్రతినిధుల సభ ఉపాధ్యక్షుడు నిర్ణయించకపోతే.. అప్పుడు సెనేట్ నిర్ణయాన్ని లెక్కలోకి తీసుకుని అక్కడ ఓట్లు లెక్కిస్తారు. అమెరికా అధ్యక్షుడి ఎన్నికల విషయంలో ప్రతి రాష్ట్రానికి ఒకే ఓటు ఉంటుంది. అంటే 50 రాష్ట్రాలకు 50 ఓట్లు ఉండగా.. 26 లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి గెలుస్తారు. వైస్‌ ప్రెసిడెంట్‌ విషయంలో సెనేట్ 100 మంది సభ్యులు ఓటు వేస్తారు. 51 ఓట్లు సాధించినవారు గెలుస్తారు. ఇది 1836 లో ఒకసారి జరిగినట్లు అమెరికా చరిత్ర చెప్తున్నది.
ఈసారి ఏదో భిన్నంగా ఉండవచ్చా?
ఎలక్టోరల్ కాలేజీ లెక్కింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తానని మిస్సౌరీకి చెందిన సెనేటర్ జోష్ హాలీ చెప్పారు. అయితే, ఈ లెక్కింపును అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, జో బైడెన్‌కు సంపూర్ణ మెజారిటీ లభించినట్లు ఇప్పటికే ప్రకటించారని, ఇది కేవలం కాంగ్రెస్‌ ఫార్మాలిటీ మాత్రమే అని అమెరికా మీడియా పేర్కొంటున్నాయి. అమెరికాలోని ప్రతి రాష్ట్రానికి స్వంత రాజ్యాంగం ఉన్నది. ఆయా రాష్ట్రాలు తమ ఓటర్లను ధ్రువీకరించి ఎన్నికల అధికారులకు పంపుతాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి సందేహానికి తావుండదని చెప్పవచ్చు.
మైక్‌ పెన్స్‌కు తొలనొప్పేనా?
అమెరికాలో అధ్యక్ష పదవికి ఒక అభ్యర్థి సాధారణంగా రెండు పర్యాయాలు పనిచేయవచ్చు. మొదటి పదవీకాలం తర్వాత డొనాల్డ్‌ ట్రంప్ ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20 న జరుగనున్న ఉమ్మడి సమావేశానికి ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అధ్యక్షత వహించనున్నారు. ఈయన మొన్నటి ఎన్నికల్లో కమలాదేవి హారిస్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. అలాగే, ట్రంప్‌కు అనుచరుడుగా ఉన్నారు. బైడెన్‌ ఎన్నికను గుర్తించేది లేదని ట్రంప్‌ అంటుండగా.. తమ ప్రత్యర్థి డెమోక్రాట్ పార్టీకి చెందిన జో బైడెన్ పేరును అధ్యక్షుడిగా, కమలా హారిస్‌ను ఉపాధ్యక్షురాలుగా ప్రకటించాల్సిన బాధ్యత సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మైక్‌ పెన్స్‌పై పడింది. దాంతో మైక్‌ పెన్స్‌ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క చందంగా తయారైంది. బైడెన్‌ పేరును ప్రకటించడం ద్వారా ట్రంప్‌ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. కాదూ కూడదంటే.. ఎంతో ప్రాధాన్యం ఉన్న సంయుక్త సమావేశం పరువు తీయాల్సి ఉంటుంది. ఇది నిజంగా మైక్‌ పెన్స్‌ను తలనొప్పిగా,  అసౌకర్యవంతంగా తయారైందని పలువురు రాజకీయ నిపుణులు అంటున్నారు.
 

Related Posts