టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడ ఉన్నా..ఏం చేస్తున్నా.. ఏపీలో రాజకీయాలపై ఆయన ఎప్పుడూ మనసు పెడుతూనే ఉన్నారు. పెడుతున్నారు కూడా. అయితే ఈ రాజకీయాలు కేవలం టీడీపీ వరకే పరిమితమైతే.. ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ, అలా లేదని టీడీపీ నేతల మధ్య చర్చ సాగుతుండడం గమనార్హం. నిత్యం ఏదో ఒక అంశంపై చంద్రబాబు.. టీడీపీ నాయకులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. జిల్లాలు, మండలాలు, నియోజకవర్గాలు, గ్రామాలు ఇలా పార్టీలో అన్ని వర్గాలకు ఆయన నిత్యం ఏదో ఒక రూపంలో క్లాస్ లు పీకుతున్నారు.పార్టీ తరఫున ఏయే విషయాలపై పోరాడాలి ? ప్రభుత్వాన్నిఎలా టార్గెట్ చేయాలి ? గతంలో తాము ఏం చేశాం.. అనే విషయాలపై పెద్ద ఎత్తున ఆయన తమ్ముళ్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే.. అదే సమయంలో తన అనుకూల మీడియాకు కూడా చంద్రబాబు బ్రీఫింగ్ ఇస్తున్నారని టీడీపీలో చర్చ సాగుతోంది. ఆది నుంచి అనుకూల మీడియాతో నిత్యం టచ్‌లో ఉండేవారు చంద్రబాబు. కానీ, పార్టీ ఓటమి తర్వాత.. ఒకింత అనుకూల మీడియాపై ఆయన గుస్సాగా ఉన్నారు. అనుకూల మీడియాలో తనను ప్రొజెక్టు చేయడంలో కొంత వెనుకబాటు కనిపించిందనేది చంద్రబాబు ఆవేదన.ఇది చంద్రబాబు ఆవేదన మాత్రమే కాదు.. తమ్ముళ్ల ఆవేదన కూడా. పార్టీ ఘోరంగా ఓడిపోయాక టీడీపీకి ఎంత భజన చేసినా ఛానెల్స్‌కు రేటింగ్ కూడా రాకపోవడంతో టీడీపీ కార్యక్రమాలు హైలెట్ చేయడం కాస్త తగ్గించారు. అమరావతి ఉద్యమాన్ని టీడీపీ అనుకూల మీడియా ఎంత మోసినా ఊపు రాకపోవడమే ఇందుకు ఉదాహరణ. ఇక చంద్రబాబు కూడా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత హైదరాబాద్‌లోనూ ఉంటూ కొన్నాళ్ల పాటు.. మౌనంగా ఉన్నారు. ఇక, ఇటీవల కాలంలో జగన్ దూకుడు పెరగడం.. టీడీపీ తమ్ముళ్లు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరం కావడంతో చంద్రబాబు ఇటు పార్టీని.. అటు అనుకూల మీడియాను కూడా మేనేజ్ చేస్తున్నారనే చర్చ సాగుతోంది.ఇటు పార్టీ నేతలతో టచ్‌లో ఉంటూనే మరో వైపు అనుకూల మీడియా అధినేతలతో నిత్యం టచ్‌లో ఉంటున్నారని టీడీపీలోనే చర్చ సాగుతోంది. చంద్రబాబు కనుసన్నల్లోనే కథనాలు వస్తున్నాయని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా జగన్ దూకుడుగా ఉండడం, వివిధ పథకాలు అమలు చేస్తుండడంతో ప్రజల దృష్టిని మళ్లించేలా కథనాలు రాయిస్తున్నారని టీడీపీ వర్గాల్లోనే చర్చ సాగుతుండడం గమనార్హం. మరి ఈ మీడియా మేనేజ్ టీడీపీకి, చంద్రబాబుకు ఎంత వరకు కలిసొస్తుందో ? చూడాలి.