వరుణుడు కరుణించి సకాలంలో వర్షాలు కురవడంతో వాగూవంకలు పొంగిపొర్లాయి. జలాశయాలు నిండు కుండలా తొణికిసలాడాయి. గత ఏడాది మాదిరిగానే ఈఏడాదీ హలధారులు సిరులు పండించారు. పచ్చని పైర్లతో గ్రామ సీమలు విలసిల్లుతున్నాయి. ధాన్యపు రాశులతో రైతు లోగిళ్లు కళకళలాడాయి. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న దశలోనూ రైతులకు సర్కారు దన్నుగా నిలిచింది. నివర్ తుఫాన్ కాస్త ఇబ్బంది పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవడంతో అన్నదాతల మోముల్లో ఆ బాధ ఛాయలు కనుమరుగయ్యాయి. మొత్తం మీద 2020వ సంవత్సరం కర్షక మహారాజులకు మేలు చేకూర్చింది. జిల్లాలో వర్షపాతం ఈ ఏడాది ఇప్పటి వరకు సాధారణం కంటే అధికంగా నమోదైంది. సాధారణంగా ఈ ఏడాది 757.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 905.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఈ ఏడాది సాధారణ వర్షం కంటే 148.50 మిల్లీమీటర్లు అధికంగా కురిసింది. ఈ ఏడాది పంటల సాగు గత ఏడాదికంటే అధిక మొత్తంలో సాగు చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు పాలనలో వరుసగా ఐదేళ్లు కరువు సంభవించి జిల్లా రైతులు అల్లాడిపోయారు. గత ఏడాది వ్యవసాయ సీజన్, ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్‌లో విస్తారంగా పంటలు సాగు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 2,18,248 హెక్టార్లు కాగా అందులో 2,02,749 హెక్టార్లలో పంటలు వేశారు. రబీ 2020–21 సీజన్‌లో జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2,42,997 హెక్టార్లు కాగా ఇప్పటికే 1,80,210 హెక్టార్లు పంటలతో కళకళలాడుతున్నాయి. రైతులకు వ్యవసాయ సేవలు అందుబాటులో ఉంచేందుకు విప్లవాత్మకంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లాలోని ప్రతి గ్రామ సచివాలయానికి అనుబంధంగా మొత్తం 879 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధకం, మార్కెటింగ్ శాఖలకు సంబంధించిన సేవలన్నీ గ్రామ స్థాయిలో ఒకేచోట అందిస్తున్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా జిల్లా వ్యాప్తంగా 3,692 టన్నుల విత్తనాలు ఎరువులు, పురుగు మందులను రైతులకు సరఫరా చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులను నిత్యం రైతులకు అందుబాటులో ఉంచేందుకు 870 ఎరువుల నిల్వ గోడౌన్లు కూడా ఏర్పాటు చేశారు. వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ, విజ్ఞాన ప్రదర్శనలు, వ్యవసాయ లైబ్రరీ, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల తయారీ, వివిధ పథకాల్లో లబ్ధిదారులను గుర్తించడం, పంటల నమోదు తదితర సేవలు రైతులకు నిరాటంకంగా అందుతున్నాయి.జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 12 వ్యవసాయ ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. వీటికి వైఎస్సార్ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలుగా నామకరణం చేశారు. వీటి ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే వీటి సొంత భవనాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన పంట ఉత్పత్తులు దాదాపు 56 వేల క్వింటాళ్లను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసింది. ధాన్యంతోపాటు సజ్జ, మొక్కజొన్నలను కూడా కొనుగోలు చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు రైతుల గ్రామాల్లోనే సేకరించే విధంగా ఏర్పాట్లు చేసింది. ఖరీఫ్ సీజన్‌లో సజ్జ కొనుగోలుకు 69 కేంద్రాలు, మొక్కజొన్నకు 37, కొర్ర 46, వరి 115, పత్తి కొనుగోలుకు 3 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాతోపాటు కడప, నెల్లూరు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీశైలం డ్యామ్ నుంచి నీరు సరఫరా చేసే రెండు సొరంగాల్లో ఒక టన్నెల్ తవ్వకం ఇటీవల పూర్తయింది. ఒకటవ టన్నెల్ పొడవు 18.787 కిలోమీటర్లు కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే నాటికి 15.600 కి.మీ తవ్వారు. మిగతా 3.187 కి.మీ సొరంగాన్ని 18 నెలల్లోనే తవ్వేసి రెండో టన్నెల్ నిర్మాణం వైపు దృష్టి సారించారు. ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా గుండ్లకమ్మ ప్రాజెక్టు ఆయకట్టు అభివృద్ధికి ప్రభుత్వం రూ.102 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఆ పనులు టెండర్ల దశలో ఉన్నాయి. వీటితో పాటు కొరిశపాడు ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి కూడా పనులు సాగుతున్నాయి. పాలేరుపై నిర్మించ తలపెట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టు పాత టెండర్లు రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. జిల్లా ఖరీఫ్–2019 పంట కాలానికిగాను రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీ రూ.10.01 కోట్లను ప్రభుత్వం వైఎస్సార్ వడ్డీ లేని పంట రుణాల కింద బ్యాంకులకు చెల్లించింది. జిల్లాలో మొత్తం 3,55,252 మంది రైతులు రూ.4,067 కోట్ల పంట రుణాలు తీసుకోగా అందులో 44,591 మంది సున్నా వడ్డీకి అర్హులుగా ఎంపికయ్యారు. రూ.లక్ష రుణం పొంది ఏడాదిలోగా చెల్లించిన వారికి ప్రభుత్వం పూర్తిగా వడ్డీ చెల్లించింది.