అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరించారు. క్రమబద్ధంగా అధికార బదిలీకి అంగీకరిస్తున్నట్లు ఆయన ఇవాళ ప్రకటన జారీ చేశారు. బుధవారం క్యాపిటల్ హిల్‌లో యూఎస్ కాంగ్రెస్ బైడెన్ ఎన్నికకు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ట్రంప్ ఈ ప్రకటన విడుదల చేశారు. జవనరి 20వ తేదీన జరగనున్న దేశాధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి లైన్ క్లియర్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కానీ తాజాగా ముగిసిన ఎన్నికల్లో మాత్రం మోసం జరిగినట్లు ట్రంప్ మళ్లీ మళ్లీ చెప్పారు. ఎన్నికల ఫలితాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను, అయినా కానీ జనవరి 20 నాటికి క్రమబద్ధంగా అధికార బదిలీ జరుగుతుందని ఆయన అన్నారు.ట్రంప్ తన ప్రతినిధి ట్విట్టర్ అకౌంట్‌లో ఈ ప్రకటన చేశారు. క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిన నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలైన ట్విట్టర్, ఎఫ్‌బీ, ఇన్‌స్టా అకౌంట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. కేవలం న్యాయపరమైన ఓట్లను మాత్రమే లెక్కించేందుకు తాను పోరాటం చేస్తున్నానని, అధ్యక్ష చరిత్రలో ఓ గొప్ప తొలి శకం ముగిసిందని, కానీ మళ్లీ అమెరికాను అత్యున్నత స్థానంలో నిలిపేందుకు పోరాటం చేస్తూనే ఉంటామని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ ట్రంప్ క్యాంపేన్ సుమారు 60 కేసులు వేసింది. కానీ ఆ కేసులన్నీ తేలిపోయాయి.