తిరుపతి, జనవరి 8,
తిరుపతి ఉప ఎన్నికల బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. తిరుపతి ఉప ఎన్నిక విషయంలో తేడా కొడితే పార్టీ బలోపేతానికి ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై బీజేపీ నేతలు సీరియస్ గా ఆలోచిస్తున్నారట. తిరుపతి ఉప ఎన్నికలో ఓటమి పాలయినా మరో ఉప ఎన్నికను రప్పించి నెగ్గేలా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారని పార్టీలో జోరుగా ప్రచారం జరగుతుంది. తిరుపతి ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేసి ఓటమి పాలయినా అది బీజేపీ, జనసేన పై భవిష్యత్ లో ప్రభావం పడనుంది.తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీని కాదని రెండో ప్లేస్ కు వచ్చే ఛాన్స్ లేదని బీజేపీ నేతలకు తెలియంది కాదు. పైకి పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇస్తున్నా లోపల మాత్రం ఓటమి తప్పదని ఫిక్స్ అయ్యారు. ఇక్కడ వైసీపీ, టీడీపీ బలంగా ఉండటమే అందుకు కారణం. బీజేపీ ఇక్కడ పోటీ చేయాలనుకుని తొలుత అనుకున్నా తర్వాత పునరాలోచనలో పడ్డారన చెబుతున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా జనసేన కే కేటాయిస్తే బాగుంటుందని పలువు సూచిస్తున్నారు.కారణం లేకపోలేదు. తిరుపతి ఉప ఎన్నికలో ఓటమి పాలయితే ఆ ఎఫెక్ట్ బీజేపీ పైనే ఎక్కువగా పడుతుంది. అందుకే ఇప్పుడు నర్సాపురం పార్లమెంటుపై బీజేపీ నేతల కన్ను పడిందంటున్నారు. నర్సాపురంలో బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది. అలాగే జనసేన కు కూడా బలమైన సామాజికవర్గం అండగా ఉంటుంది. అందుకే నర్సాపురం ఉప ఎన్నిక రప్పించాలన్న ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారని కొందరు పార్టీ నేతలే చెబుతున్నారు.వైసీపీ ఇప్పటికే తన పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత పిటీషన్ ఇచ్చింది. ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తే ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. మరోవైపు అదే రఘురామకృష‌్ణంరాజును బీజేపీలోకి తీసుకు వచ్చి పోటీ చేయిస్తే సులువుగా నెగ్గగలమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకే తిరుపతి ఉప ఎన్నికను జనసేనకే వదిలేయాలని బీజేపీ లో కొందరు గట్టిగా వాదిస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలు సయితం ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం విశేషం. మొత్తం మీద తిరుపతి కంటే నర్సాపురం పార్లమెంటుపైనే బీజేపీ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కన్పిస్తుంది.