YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

15 రూపాయిలకు పడిపోయిన చికెన్

15 రూపాయిలకు పడిపోయిన చికెన్

న్యూఢిల్లీ, జనవరి 8 
భారతదేశంలో బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది.ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో చికెన్, కోడి గుడ్లు తినే వాళ్లే లేకుండా పోయారు. పలు రాష్ట్రాల్లో బ‌ర్డ్ ఫ్లూతో వేలాది కాకులు, బాతులు మృతి చెందడంతో పౌల్ట్రీ బిజినెస్ కూడా దెబ్బ‌తింటోంది. చికెన్ తినొచ్చ‌ని వైద్యులు చెబుతున్నా చాలా ప్రాంతాల్లో ప్ర‌జ‌లు నమ్మడం లేదు. బ‌ర్డ్ ఫ్లూ విజృంభ‌ణ కార‌ణంగా హ‌ర్యానాలోని జింద్ జిల్లా నుంచి ఢిల్లీకి కోళ్ల త‌ర‌లింపుపై తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఢిల్లీలో కిలో కోడి మాంసం ఖరీదు రూ.15కు పడిపోయింది. వాటి ధ‌ర ఒక్క‌సారిగా ప‌డిపోవ‌డంతో కోళ్ల వ్యాపారులు ప్రతిరోజూ సుమారు కోటీ 20 లక్షల రూపాయలు నష్టపోతున్నారు. జింద్ జిల్లాలో పౌల్ట్రీ ప‌రిశ్ర‌మ‌కు మంచి పేరుంది. ఆ జిల్లాలో 500కు పైగా పౌల్ట్రీ ఫారాలు, 80కి పైగా హ్యాచరీలు ఉంటాయి. అక్క‌డి నుంచి ఢిల్లీకి విక్రయించే కోళ్ల‌ బరువు సుమారు 8 లక్షల కిలోగ్రాములుంటుంది. చికెన్ ను బాగా ఉడికించి తినడం వల్ల న‌ష్ట‌మేమీ ఉండ‌ద‌ని వైద్యులు అంటున్నా కూడా ప్రజలే భయపడుతూ ఉండడంతో చికెన్ ధర మరింత తగ్గిపోయే అవకాశం ఉంది.
విదేశాల నుంచి భారత్ వచ్చే వలస పక్షుల వల్లే బర్డ్ ఫ్లూ భారత దేశంలో మళ్లీ కనిపిస్తోందని  కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. బర్డ్ ఫ్లూ కేసులు ప్రపంచం మొత్తం ఉన్నాయని, అయితే గత సెప్టెంబరులో భారత్ ను బర్డ్ ఫ్లూ రహిత దేశంగా ప్రకటించామని అన్నారు. శీతాకాలం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అక్టోబరులో రాష్ట్రాలకు సలహా ఇచ్చామని.. ఇప్పుడు భారత్ లో మళ్లీ బర్డ్ ఫ్లూ కేసులు వస్తుండడానికి కారణం విదేశాల నుంచి వచ్చే వలస పక్షులేనని తెలిపారు. దేశంలో వలస పక్షులకు ఆవాసంగా ఉండే ప్రాంతాల్లోనే బర్డ్ ఫ్లూ కేసులు అధికంగా వస్తున్నాయని తెలిపారు.
ఇక గుంటూరు జిల్లాలో పలు కాకులు మృతి చెందడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. కొల్లిపర మండలం గుదిబండివారి పాలెం హైస్కూల్ వద్ద 6 కాకులు మృతి చెందాయి. ఒక్కసారే అన్ని కాకులు మరణించడంతో స్థానికులు ఆ విషయాన్ని వెటర్నరీ అధికారులకు తెలియజేశారు. స్థానిక వెటర్నరీ అధికారిణి శ్రీలక్ష్మి మాట్లాడుతూ, గత మూడ్రోజులుగా ఇక్కడ కాకులు మృత్యువాత పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. బర్డ్ ఫ్లూ అనుమానంతో ఇక్కడి కోళ్లఫారాలను పరిశీలించామని, ఎక్కడా అనుమానించదగ్గ లక్షణాలు కనిపించలేదని స్పష్టం చేశారు.

Related Posts