YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

కరోనాతో మూతపడ్డ 123 కాలేజీలు

కరోనాతో మూతపడ్డ 123 కాలేజీలు

హైదరాబాద్, జనవరి 8,
రాష్ట్రంలోని ప్రయివేటు జూనియర్‌ కాలేజీల నిర్వహణపై కరోనా దెబ్బ పడింది. కాలేజీల నిర్వహణ యాజమాన్యాలకు భారంగా మారింది. దీంతో ఈ విద్యాసంవత్సరంలో 123 కాలేజీలు మూతపడ్డాయి. గత విద్యాసంవత్సరంలో 1,663 కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో 1,540 మాత్రమే అనుబంధ గుర్తింపు కోసం ఇంటర్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. అంటే 123 కాలేజీల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోలేదు. చాలా కాలేజీలు అద్దె భవనాల్లో ఉంటున్నాయి. కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఇంకా కాలేజీలు తెరవలేదు. అద్దె భవనాల్లో ఉండే కాలేజీల యాజమాన్యాలు అద్దె చెల్లించడం భారంగా మారింది. ఇంకోవైపు అధ్యాపకులకు జీతాలివ్వడం మరింత ఇబ్బందిగా ఉన్నది. కాలేజీల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేయని యాజమాన్యాలు వాటిని మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వాటి లో చదివే విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేర్పించి నట్టు సమాచారం. వారి భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి.రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరంలో 1,540 కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 1,466 కాలేజీలకు ఇంటర్‌ బోర్డు గుర్తింపు ఇచ్చింది. 74 కాలేజీలకు గుర్తింపు రావాల్సి ఉన్నది. ఇందులో 41 కాలేజీలు షిఫ్టింగ్‌ (తరలింపు) కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 17 కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. మిగిలిన 24 కాలేజీల అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. ప్రస్తుతం 57 కాలేజీల గుర్తింపు ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నది. ఫైర్‌ ఎన్‌వోసీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు కల్పించినా సరైన పత్రాలు సమర్పించక పోవడం వల్ల ఆ కాలేజీలకు గుర్తింపు రాలేదని సమాచారం. ఇంకోవైపు షిఫ్టింగ్‌ పేరుతో కాలేజీ యాజమాన్యాల చేతులు మారినట్టు సమాచారం. చిన్న కాలేజీలను కార్పొరేట్‌ కాలేజీ యాజమాన్యాలు షిఫ్టింగ్‌ పేరుతో కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది.మే 4 నుంచి జూన్‌ 10 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు సీబీఎస్‌ఈ ప్రకటించింది. అంతకంటే ముందుగానే రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అంటే ఏప్రిల్‌లో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. మూడు గంటలపాటు పరీక్ష ఉంటుందనీ, ఇందులో ఎలాంటి మార్పు లేదని సమాచారం. అయితే విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు ఎక్కువ ప్రశ్నలు అడిగి తక్కువ సమాధానాలు రాబట్టేలా ప్రశ్నాపత్రం రూపొందిస్తామని అధికారులు చెప్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఇంటర్‌ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపునకు తేదీలు ప్రకటించాలని భావిస్తున్నారు. సాధారణంగా జూనియర్‌ కాలేజీలు 180 పనిదినాల్లో పనిచేయాలి. కరోనా నేపథ్యంలో సిలబస్‌ను 70 శాతానికి కుదించారు. దీంతో 154 పనిదినాలు కావాలి. ఇప్పటికే ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో 96 పనిదినాలు పూర్తయ్యాయి. మిగిలిన పనిదినాలు మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న 138 మంది జూనియర్‌ లెక్చరర్లకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు లభించనున్నాయి. రాష్ట్రంలో వివిధ శాఖల్లో పదోన్నతులు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈనెలాఖరులోగా పదోన్నతులు పూర్తి చేయాలని అన్ని శాఖలనూ ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఇంటర్‌ విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇంకోవైపు కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్ల స్థానచలనం అంశాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. సర్వీసు నిబంధనలు లేనందున ఎలా చేపడితే బాగుంటుందన్న అంశంపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం.

Related Posts