తిరుమలలోని జీఎన్‌సీ కాటేజీలో రాత్రి చోరీ జరిగింది. రెండు గదుల తాళాలను పగలగొట్టి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. విజిలెన్స్ అధికారులు తెలిపిన ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన ఓ భక్త బృందం శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చారు. జీఎన్సీలోని 527 ఈ, ఎఫ్ గదులను అద్దెకు తీసుకున్నారు. వీరు సాయంత్రం 6 గంటలకు గదులకు తాళం వేసి దర్శనానికి వెళ్లారు. తిరిగి రాత్రి 8 గంటలకు వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉండటంతో పాటు వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. వీరు విజిలెన్సు అధికారులకు సమాచారమిచ్చారు. ఓ గదిలో ఉంచిన రూ.22 వేల నగదు, ఓ సెల్‌ఫోన్ కనిపించలేదని భక్తులు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ దొంగతనానికి పాతనేరస్థులే పాల్పడినట్టు సమాచారం. జీఎన్సీ ప్రాంతం తిరుమలకు చివరగా ఉండటంతో ఇటీవల చోరీలు పెరిగాయి. ఈనెల ఒకటో తేదీన ఒంగోలుకు చెందిన సత్యనారాయణ కూడా శ్రీవారి దర్శనానికి వచ్చి జీఎన్సీలోని 523లోని ఏ గదిను అద్దెకు తీసుకున్నారు. ఇప్పటి తరహాలోనే ఆ గది తాళాలనూ పగలగొట్టి మూడు సెల్‌ఫోన్లు, 7 వేల నగదును దుండగులు అపహరించుకుపోయారు. భక్తుల సంచారం పెద్దగా లేని ఈ ప్రదేశంలో పోలీసులు, విజిలెన్స్ అధికారులు నిఘా పెంచాలని భక్తులు కోరుతున్నారు.