తమ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులకు మతాలను ఆపాదించొద్దని రాజకీయ నేతలను విశాఖ నగర పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు కోరారు. పోలీస్ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ అధికారుల సంఘం తరఫున సీఐ సోమశేఖర్, ఎస్‌ఐ సీహెచ్ వెంకటరావు, కానిస్టేబుళ్లు ఎం.శుభకర్, వి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో కొంతమంది రాజకీయనేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులకు మతాలు, కులాలను ఆపాదిస్తున్నారని ఆరోపించారు. దీనిని నగర పోలీస్ కమిషనరేట్ తరఫున ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 14 వేల మంది పోలీసులు ఉన్నారని, వీరిలో అన్ని మతాలకు చెందినవారు ఉన్నారన్నారు. అన్ని మతాల పండుగలు, కార్యక్రమాలకు వీరంతా బందోబస్తు విధులు నిర్వర్తిస్తారనే విషయాన్ని అందరూ గుర్తించాలని కోరారు.