జగన్ సర్కార్పై సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం పాలన కనకపు సింహాసనంపై శునకం కూర్చొన్న విధంగా సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని బాలకృష్ణ అన్నారు. అలా చేయకపోగా పంట ఉత్పత్తులను దళారుల పాలుచేస్తోందని మండిపడ్డారు. అనంతపురం జిల్లా లేపాక్షి మండలం శిరివరంలో ప్రస్తుతం కల్లాలలో ఉన్న మొక్కజొన్నలను పరిశీలించిన బాలకృష్ణ.. అక్కడి రైతులతో మాట్లాడారు. వెంటనే రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ-క్రాప్ బుకింగ్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని బాలకృష్ణ ఆరోపించారు. రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ ప్రభుత్వంపై అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఏం చెప్పినా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అయన మండిపడ్డారు. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోతే ఢిల్లీ తరహా ఉద్యమం తప్పదని బాలకృష్ణ హెచ్చరించారు. రాష్ట్రంలో కులాలు, మతాల పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేసి పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.