బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియను కస్టడీ కోసం బోయిన్ పల్లి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అఖిల ప్రియను ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. కస్టడీలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, పోలీసులు కోర్టుకు తెలియజేశారు. అంతేకాకుండా ఈ కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అనుచరుల పాత్ర కూడా ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అఖిలప్రియ అనుచరులకు గతంలో మరికొన్ని కేసుల్లో ప్రమేయం ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
అఖిలప్రియ భర్తతో సహా మిగతా నిందితులను కూడా అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్ కేసులో బాధితులను కిడ్నాప్ చేసిన సమయంలో బాధితులతో సంతకాలు చేయించుకున్న దస్త్రాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేశాక కిడ్నాప్ సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయాల్సి ఉందని, అందుకే అఖిల ప్రియను ఏడు రోజులపాటు రేపటి నుంచి ఈనెల 15 వరకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు.అయితే ఈ సందర్భంగా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి స్పందించారు. ''మా అక్క భూమా అఖిల ప్రియ ను ఈ కేసులో వేధింపులకు గురిచేస్తున్నారు. భూమా ఫ్యామిలీని ఆర్థికంగా , రాజకీయంగా దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కేసులో మా వాళ్ళ ప్రేమేయం లేకున్నా ఈ కేసులో కావాలనే ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు. హఫీజ్ పేట్ 25 ఎకరాల భూమి మాదే, అయితే మా ఆస్తులను కాజేయాలనే ప్రయత్నం చేస్తోంది.'' అని అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి, తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.