నోవల్ కరోనా వైరస్ కేసులు చైనాలో గత ఏడాది ఆరంభంలో అత్యధిక స్థాయిలో నమోదు అయిన విషయం తెలిసిందే. వుహాన్ నగరం ఆ వైరస్‌కు కేంద్ర బిందువుగా నిలచింది. ఆ నగరంలో వైరస్ కేసులు బీభత్సం సృష్టించాయి. అయితే పీఎల్ఓఎస్ నెగ్‌లెక్టెడ్ ట్రాఫికల్ డిసీజెస్ తాజాగా ఓ నివేదికను రిలీజ్ చేసింది. ఆ నివేదిక ప్రకారం వుహాన్‌లో నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేసింది. గత ఏడాది మార్చి నుంచి మే మధ్య కాలంలో సుమారు 60 వేల మంది చైనీయుల నుంచి శ్యాపిళ్లను సేకరించారు. ఆ శ్యాంపిళ్లకు జరిపిన పరీక్షల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. వుహాన్ నగరం నుంచి సేకరించిన శ్యాంపిళ్లలో సార్స్ సీవోవీ2 వైరస్ 1.68 శాతం మందిలో యాంటీబాడీలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. హుబేయ్ ప్రావిన్సులో 0.59 శాతం, మిగితా చైనాలో 0.38 శాతం అధిక కేసులు నమోదు అయినట్లు పసికట్టారు. వుహాన్ నగరంలో సుమారు కోటి మందికిపైగా జనాభా ఉన్నారు. అయితే వారిలో సుమారు 168000 మందికి వైరస్ సోకి ఉంటుందని అంచనాకు వచ్చారు.
చైనా మాత్రం అధికారికంగా కేవలం 50 వేల మందికి మాత్రమే ఆ నగరంలో వైరస్ సోకినట్లు చెప్పింది. కనీసం రెండింట మూడవ వంతు మందిలో లక్షణాలు లేవని స్టడీ తేల్చింది. చైనాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) లెక్కల ప్రకారం వుహాన్‌లో ఇన్‌ఫెక్షన్ రేటు 4.43 శాతం ఉందని, అంటే దాదాపు ఆ నగరానికి చెందిన సగం జనాభా వైరస్ బారిన పడి ఉంటారని తేల్చారు.