విజయవాడ, జనవరి 9,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియని పని..! స్థానిక ఎన్నికలు నిర్వహించాలని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎప్పటి నుండో ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఏ తేదీల్లో నిర్వహించాలన్నది ఎస్.ఈ.సీ. ఇష్టం. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితులు వేరేలా ఉన్నాయి. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకోవడం.. అందుకు వైసీపీ నాయకులు, ప్రభుత్వం ఏ మాత్రం ఇష్టపడకపోవడం చూస్తూనే వచ్చాం. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కోర్టులను కూడా ఆశ్రయించారు. కోర్టులు కూడా ఆయనకు అనుకూలంగా తీర్పును ఇచ్చాయి. ఆయన ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటూ ఉండగా.. వైసీపీ ముఖ్య నేత ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం తనదైన శైలిలో ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు చేస్తూ ఉన్నారు. విజయ సాయి రెడ్డి ఇటీవల మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు ఏప్రిల్, మేలో జరుగుతాయని తమ పార్టీ విశ్వసిస్తుందని ఆయన అన్నారు. ఈ మాటలకు అర్థం.. ఎన్నికలు నిర్వహించడం.. నిర్వహించకపోవడం అన్నది..తమ చేతుల్లోనే ఉందని..! నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం.. మార్చితో ముగుస్తుండడంతో ఎన్నికలు నిర్వహించడం వంటి అంశాలు తమ చేతుల్లోనే ఉండనున్నట్లు వైసీపీ వర్గాలు నమ్ముతూ ఉన్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైరైన తర్వాత.. కనగరాజును నియమించుకున్న తర్వాత ఎన్నికలను నిర్వహించాలని అనుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కరోనా పూర్తిగా అంతమైపోతుంది ఏకగ్రీవాలతో ఎన్నికలను పూర్తి స్థాయిలో ఏకపక్షంగా నిర్వహించుకునే అనుకూల వాతావరణం ఏర్పడుతుందని వైసీపీ వర్గాలు అనుకుంటూ ఉన్నాయి. తిరుపతి ఉపఎన్నిక మార్చిలోపు జరగాల్సి ఉండగా.. అది పూర్తయిన తర్వాత వైసీపీ స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఆంటున్నారు. స్థానిక ఎన్నికల బాధ్యత తనపైనే ఉన్నట్లుగా విజయసాయిరెడ్డి చెబుతూ ఉన్నారని.. ఎన్నికలు ఎప్పుడో విజయసాయి ఇష్టమనే విషయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చారు. ఏది ఏమైనా తాము అనుకున్నప్పుడే ఎన్నికలను నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం అనుకుంటోంది.