కడప, జనవరి 9,
కడప జిల్లాలో అణుకుంపటి రగులుతోంది. ఇప్పటికే ప్రారంభమైన తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టుతో అనేక అనర్థాలు వెలుగులోకి రాగా, రెండో ప్లాంటు కోసం ప్రజాభిప్రాయ సేకరణ తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఇది వరకే ఇచ్చిన హమీలు తుంగలొకి తొక్కిందంటూ యుసిఐఎల్ యాజమాన్యం తీరుపై రగిలిపోతున్న జనాలకు ముందస్తుగా ప్రలోభాల పర్వానికి తెరలేపినట్లు తెలుస్తొంది. మూడేళ్లుగా ముందుకు పడని అడుగు ఈ సారి ఎలాగైనా పడుతుందన్న ధీమాతో యుసిఐఎల్ ముందుకు వెళుతుంటే ప్రజా సంఘాలు మాత్రం అడ్డుకుని తీరాతామని తెగేసి చెబుతుండటం ఉత్కంఠను రేపుతోంది. కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లె వద్ద ఏర్పాటు చేయనున్న యురేనియం రెండో ప్లాంటు వద్దంటూ జిల్లా వాసులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. తుమ్మలపల్లెలో తొలి యురేనియం శుద్ది కర్మాగారం పనులు 2008లో ప్రారంభమై దాదాపు నాలుగేళ్లకు పూర్తయ్యాయి. అనేక అవంతరాలు అదిగమించి 2011 ఏప్రిల్ 20న ప్రారంభించారు. ఆ తర్వాత ప్రాజెక్టులో యురేనియం ఉత్పత్తి అయ్యేందుకు 10నెలలు పట్టింది. శుద్దిచేయగా మిగిలిన వ్యర్థాలను 2008 నుంచి టెయిలింగ్‌పాండ్‌లోకి పంపుతున్నారు. టెయి లింగ్‌పాండ్‌కు వచ్చిన వ్యర్థాల్లో తేరిన నీరు మరొక సంపులోకి ప్రవహిస్తుంది. ఆ నీటిని మళ్లీ శుద్దికర్మాగారానికి మోటార్ ద్వారా ఎత్తిపోస్తారు. కానీ ఎత్తిపోసే స్థాయిలో ఇక్కడ నీరు లేకపోయినా యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారులు మాత్రం అలాగే ప్లాంటు రన్ చేస్తున్నారు. భూమిలోకి నీరు ఇంకడం వల్ల యురేనియం శుద్ది కర్మాగారం ఈ ప్రాంతానికి శాపంలా మారింది. తుమ్మలపల్లె యురేనియం ప్లాంటు ప్రభావం సమీప గ్రామాల్లో అనతి కాలంలోనే వెలుగులొకి వచ్చింది. యురేనియం వ్యర్థాలు భూగర్భంలోకి ఇంకిపోతున్నాయి. ఫలితంగా యురేనియం చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. ప్రజలు చర్మవ్యాధులబారినపడి ఇబ్బందులుపడుతున్నారు. శరీరం అలసటతో ఉంటోందని, ఎప్పుడూ హుషారుగా లేకుండా పోతోందని వాపోతున్నారు. యురేనియం టెయిల్ పాండ్ సమీపంలోని ఈ గ్రామం ఉండటంతో గ్రామంపై యురేనియం ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడి నీళ్లు తాగడంతో పుష్పవాణి కూతురు పుట్టుకతోనే చర్మవాదితో పుట్టింది. ఎన్ని మందుల వాడినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇప్పటికి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతునే ఉన్నారు. అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని పుష్పవాణి వాపోతుంది. పంట పోలాలపైన యురేనియం వ్యర్థాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కలుషిత నీరు కారణంగా సాగులో ఉన్న అరటి, మిరప, వేరుశనగ పంటలు ఎదుగుదలలేక గిటకబారిపోయాయి. పెట్టుబడులురాక గిట్టుబాటు కావని రైతులు పొలాలను బీళ్లుగా ఉంచుకున్నారు. టైలింగ్ పాండ్ పరిధిలోని కె.కె.కొట్టాల, కనంపల్లె, మబ్బుచింతలపల్లె గ్రామాల్లో వ్యవసాయ బోర్లు కూడా కలుషితమయ్యాయి. పంట పొలాల్లో భూగర్భజలాలు పారి భూమిపై తెల్లటి పొరలు ఏర్పడుతున్నాయి. పండ్లతోటలకు నీరందించే డ్రిప్ సిస్టం కూడా నాశనమైపోతోంది. ఎంతగానో నమ్మించి ప్లాంటును ఏర్పాటు చేసిన యుసిఐఎల్ యాజమాన్యం ఇఛ్చిన మాట ఏదీ నిలబెట్టుకోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ అది కూడా కంటితుడుపు చర్యగానే మిగిలిచింది. నిత్యం ఉద్యోగాల కోసం ఉద్యమించాల్సిన పరిస్ధితి. పర్యావరణం దెబ్బతినకుండా ఉండేందుకు దాదాపు 3 వేల ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉంది. దాని ఊసే లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఓ కమిటిని నియమించింది. యూసిఐఎల్ సమీప గ్రామాల్లో పర్యటించి నివేదిక ఇవ్వాలని సిఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అయా గ్రామాల్లో పర్యటించిన కమిటీ సర్కార్ కు నివేదికను సమర్పించింది. యురేనియం ప్రభావిత ప్రాంత గ్రామాలకు కృష్ణా జలాలు తరలించి మంచినీటిని అందించేందుకు పలు పథకాలకు ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా యూరేనియం రెండో ప్లాటుకు యూసిఐఎల్ పావులు కదుపుతుంది. ప్రజాభిప్రాయ సేకరణకు ముందు ఆయా గ్రామాల్లో మౌలిక వసతులపై దృష్టి సారించింది. ప్రజలను మభ్య పెట్టేందుకే యూసీఐఎల్ అభివృద్ధి పనులు చేపడుతుందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొదటి ప్లాంట్ తోనే ప్రజల బతుకులు అస్తవ్యస్తమయ్యాయని, రెండు ప్లాంట్ కు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదని హెచ్చరిస్తున్నాయి.