బ్రాండెడ్ మందుల కంటే జనరిక్ మందుల ఖర్చు తక్కువ. ఔషదం ఒక్కటే అయితే ప్యాకింగ్ లో మాత్రమే తేడా. దీంతో పలువురు బ్రాండెడ్ మెడిసిన్స్ నే ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. తక్కువ రేటుకు వచ్చే జనరిక్ మందుల్లో ఔషద గుణాలు స్వల్పంగా ఉండొచ్చన్న భావనకు తోడు వీటికి సరైన ప్రచారం లేదు. దీంతో ప్రజలు ఈ మందులను కొనేందుకు ఆసక్తి చూపడంలేదు. జనరిక్ మందులు అతితక్కువ ధరకే లభిస్తున్నా.. వాటిపై సరైన ప్రచారం లేకపోవడమే వాటికి డిమాండ్ లేకపోవడానికి ప్రధాన కారమమని నిపుణులు అంటున్నారు. అనంతపురం జిల్లాలో వివిధ కారణాల రీత్యా రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఔషదాలు అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం జనరిక్ దుకాణాల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తోంది. అయితే ఈ షాపులు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ లేవని సమాచారం. ప్రస్తుతం డిఆర్‌డిఎ- వెలుగు ఆధ్వర్యంలో అనంతపురంలో రెండు, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కొత్తచెరువు, పెనుకొండ, ఉరవకొండ, రాయదుర్గం, మడకశిర, గోరంట్లలో ఒక్కొక్కటి ఉన్నాయి. త్వరలో నార్పలలో ఓ దుకాణం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
మెప్మా ఆధ్వర్యంలోనూ జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. తాడిపత్రి, కళ్యాణదుర్గంలో దుకాణాల ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. వైద్యులు రోగులకు కేవలం మూలకం మందులపేర్లు మాత్రమే రాయాలి. కంపెనీల పేర్లు, బ్రాండ్ పేర్లను రాయకూడదని భారతీయ వైద్య విధాన మండలి ఆదేశించింది. ఇదే తరహాలో సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులిచ్చింది. అయితే పలు ప్రయివేటు ఆస్పత్రుల్లో ఇది అమలు కావడం లేదు. మూలకం మందును జనరిక్ అంటారు. ఉదాహరణకు క్రోసిన్‌లో జనరిక్ పారాసిటమాల్. బ్రాండెడ్ మందు రూ.10కి లభిస్తే అదే జనరిక్‌లో రూ.5 కే వస్తుంది. జనరిక్ అయినా, బ్రాండెడ్ అయినా ఉండే మందు ఒక్కటే. వాటి పరిమాణం, పనిచేసే తీరు, నాణ్యతలో ఎటువంటి తేడా ఉండదు. జనరిక్ దుకాణాలు సామాన్యులకు వరం లాంటివి. వీటిని ప్రజలకు చేరువ చేస్తే వారిపై భారం తగ్గుతుంది. ఈ దుకాణాల్లో మందులు తక్కువ ధరకు లభిస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ పరిస్థితిని మార్చేందుకు విస్తృత ప్రచారం చేపట్టాలి.