ఏపీలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చిన ఎస్ఈసీకి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు షాకిచ్చాయి. షెడ్యుల్ విడుదల చేయడంపై.. కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించమని ఉద్యోగ సంఘాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఎన్నికలను బహిష్కరిస్తున్నామని.. తాము సిద్ధంగా లేమని.. ఎన్నికలు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చన్నారు. ఎన్నికల విధులకు హాజరు కాలేమని.. అవసరమైతే కోర్టుకు వెళతామన్నారు.ఉద్యోగుల, ప్రభుత్వం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ఉద్యోగ సంఘాలు ప్రశ్నించాయి. ఎన్నికల కమిషన్‌కు తాము సహకరించబోమని.. వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలను నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఎండాకాలంలో అయితే ఎన్నికల నిర్వహణ అనుకూలంగా ఉంటుందంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదంటున్నారు. పంతాలకు పోయి తమను ఇబ్బంది పెట్టొద్దని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఎస్‌ఈసీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.ఏపీలో స్థానిక సంస్ధల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. పంచాయతీ ఎన్నికల్ని నిర్వహించేందుకు ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించేసింది. ఎన్నికల కోడ్ కూడా శనివారం నుంచి అమల్లోకి వస్తోందని తేల్చి చెప్పింది. నాలుగు దశల్లో ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. ఈ నెల 23న తొలి దశ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఈ నెల 27న రెండో దశ ఎన్నికలకు, ఈ నెల 31న మూడో దశ ఎన్నికలకు, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు. ఇటు ప్రభుత్వం కూడా ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది.