కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో పెద్ద ఎత్తున గుప్త నిధులు ఉన్నాయంటూ చాలా కాలంగా బలంగా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు గుప్త నిధుల కోసం ఆలయాలు తవ్వడం, విగ్రహాల ధ్వంసం చేయడం వంటివి విన్నాం కానీ నిధులు దొరికిన దాఖలాలు మాత్రం పెద్దగా లేవు. కానీ, శ్రీశైలంలో మాత్రం గుప్త నిధులు దొరికినట్లు అధికారులే ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. ఎంత భారీ మొత్తంలో గుప్త నిధులు దొరికాయని ప్రజలుచర్చించుకుంటున్నారు.అయితే తవ్వకాల్లో భారీగానే గుప్త నిధులు దొరికినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. 2017 మే 10న పంచమఠాల జీర్ణోద్ధరణ పనులు చేస్తుండగా గంటా మఠం దగ్గర 700 గ్రాముల బంగారం, రెండున్నర కేజీల వెండి లభ్యమైంది. ఆ తర్వాత జీర్ణోద్ధరణ పనులు నిలిచిపోయాయి. అదే గంటా మఠం దగ్గర 2020 సెప్టెంబర్ 7న మళ్లీ జీర్ణోద్ధారణ పనులు మొదలయ్యాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 700 గ్రాముల బంగారం ధర దాదాపు రూ. 36,26,700 (36.2 లక్షలు)గా ఉంది. అలాగే రెండున్న కేజీల వెండి రూ. 1.50 లక్షలు పలుకుతుంది.గతేడాది సెప్టెంబర్ 7, 8, 15 తేదీలతో పాటు 2020 అక్టోబర్ 4న జరిగిన తవ్వకాలలో మొత్తం 15 బంగారు నాణేలు, 263 వెండి నాణేలు, ఒక రాగి నాణెం సహా 32 తామ్ర శాసనాలు దొరికినట్లు అధికారులు వివరించారు. తర్వాత సాంకేతిక కారణాల వల్ల జీర్ణోద్ధరణ పనులు ఆగిపోయాయని, అతి త్వరలోనే మళ్లీ పనులు మొదలుపెడతామని ఆలయ అధికారులు చెబుతున్నారు. దీంతో ఇంకా ఎంత పెద్ద మొత్తంలో బంగారం, వెండి, ఇతర నిధులు బయటపడతాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.