స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఏపీలో కాకపుట్టిస్తోంది. ఎన్నికల నిర్వహణలకు ప్రభుత్వం సన్నద్ధంగా లేదని తేల్చిచెప్పినా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక్కి తగ్గలేదు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. రేపటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ప్రకటించేశారు. ఇప్పుడదే రాజకీయ దుమారం రేపుతోంది. ప్రభుత్వం, ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నా నిమ్మగడ్డ ఒంటెత్తు పోకడలకు పోతున్నారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు ఈ వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్న వైసీపీ నేతలు నిమ్మగడ్డపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. నిమ్మగడ్డ పుట్టుకతోనే ఎన్నికల కమిషనర్‌గా ఫీలవుతున్నారని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాసలో ఆయన మాట్లాడుతూ 2018లో ఎన్నికలు నిర్వహించమని హైకోర్టు చెప్పిందని.. చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా నిమ్మగడ్డ ఆ రోజు ఎన్నికలు నిర్వహించలేదని అప్పలరాజు అన్నారు. అది కోర్టు ధిక్కారం కాదా..? అని నిమ్మగడ్డను సూటిగా ప్రశ్నించారు.రాష్ట్రంలో ఒక కేసు కేసు ఉన్నప్పుడు కరోనాను సాకుగా చూపించి నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం కరోనా స్ట్రైయిన్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారని.. మరోవైపు వ్యాక్సిన్ సరఫరా దేశవ్యాప్తంగా మొదలైందన్నారు. ఇలాంటి తరుణంలో ఎన్నికల కమిషనర్‌కు ఎందుకంత ఆత్రుత అని ప్రశ్నించారు. ఎన్నికలు నిర్వహిస్తే.. నీకు, నీ యజమానికి వచ్చే లాభం ఏంటి? ఒక రాజకీయ దురుద్దేశంతో పని చేస్తున్న నువ్వా మాకు ఎన్నికల కమిషనర్. హోటళ్లలో కూర్చుని రాజకీయాలు చేసే నిమ్మగడ్డకు ఎన్నికల కమిషనర్‌గా అర్హత లేదు' అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ మాధవ్ విమర్శలు చేశారు. ఎన్నికల నిర్వహణపై ఆయన వ్యక్తిగత ఆసక్తిని చూపిస్తున్నారని.. వ్యక్తిగత ఆసక్తి ఆయన స్థాయికి మంచిది కాదని సూచించారు. నిమ్మగడ్డ రమేష్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మాధవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 'ప్రభుత్వ యంత్రాంగం కరోనా టీకాను పంపిణీ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పుడు ఎన్నికలు జరిపితే కరోనా టీకా పంపిణీకి అంతరాయం కలుగుతుంది. నిమ్మగడ్డ వ్యవహరిస్తోన్నతీరుతో ప్రజల ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదముంది' అని ఎంపీ మాధవ్ పేర్కొన్నారు.ఎస్‌ఈసీ టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, సుజనా చౌదరితో కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్ మొదలైందని.. ప్రజల భయాందోళనలను నిమ్మగడ్డ పట్టించుకోవడంలేదని అమర్నాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని.. నిమ్మగడ్డ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అమరనాథ్ డిమాండ్ చేశారు.