మన సంప్రదాయాలు, ఆచారాలు అనేక సూక్ష్మ అంశాలతో ముడిపడి ఉంటాయి. అందులో వైజ్ఞానిక, ఆరోగ్య, పారమార్థిక అంశాలు, యోగసూత్రాలకు భాష్యాలు దాగి ఉన్నాయి. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క ఆంతర్యాన్ని తెలియజేస్తాయి. జీలకర్రను సంస్కృతంలో జీర దండం అంటారు. జీర శబ్దానికి అర్థం బతుకు, జీవనం. దండం బతుకునకు ఆధారం అని సామాన్యార్థం. ఇక బెల్లాన్ని గుడం అంటారు. గుడం అంటే నిద్ర, మత్తు. దీనినే పరవశం అంటారు. ఇలా జీలకర్ర, బెల్లం అంటే జీవనాధార గుణం అని అర్థం. జీవించటానికి కావాల్సింది ప్రేమ, స్నేహం, మైత్రి, ఆపేక్ష, ఎదుటివారిని ప్రేమించటమే నిజమైన జీవనధార దండం. తాను వివాహం చేసుకుంటున్న భార్యను ప్రేమించటం, భార్య భర్తను ప్రేమించటం.. ఇద్దరిలో అన్యోన్యానురాగం మాత్రమే. వారి మధ్య ప్రేమ ఒక మత్తులా, ఒక నిద్రలా ఉండాలి. మరేది తెలియకూడదు. దీనినే ఒకరికొకరు, ఒకరిలో ఒకరు అని జీవించటమే వివాహ పరమార్థం. ఒకసారి కలిసిన దంపతులు ఇక విడిపోరాదు. జీలకర్ర, బెల్లాన్ని నూరి కలిపితే మళ్లీ మనమే విడదీయలేం. ఆ కలిపిన దాంట్లో ఒక బెల్లమే కనిపిస్తుంది. కానీ జీలకర్ర కనిపించదు. అంటే భార్యాభర్తల జీవనంలో ఎదుటివారికి వారి పరవశం, జీవన మాధుర్యం, ఆ మత్తే కనిపిస్తుంది. దాని వెనక ప్రేమ, స్నేహం, అనురాగం, మైత్రి అంతర్లీనంగా ఉంటాయి. కలిసిమెలిసి బతుకుతూ సమాజాన్ని బతికించండి అనే పరమార్థాన్ని భార్యాభర్తలకు జీలకర్ర, బెల్లం బోధిస్తుంది.