YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఇసుక డంపులపై డ్రోన్ నిఘా

 ఇసుక డంపులపై డ్రోన్ నిఘా

ఇసుక అక్రమ తవ్వకాలతో కొందరు ప్రభుత్వాదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఇసుకను యథేచ్ఛగా తవ్వేస్తూ రూ.కోట్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ తరహా చర్యలు చట్టవిరుద్ధమని తెలిసినా అక్రమార్కులు ఎక్కడా వెనక్కితగ్గడంలేదు. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ అడ్డదారుల్లో ఇసుక అక్రమ రవాణా సాగించేస్తున్నారు కొందరు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వి ఇతర ప్రాంతాల్లో డంపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కణ్ణుంచి తమ బిజినెస్ సాగిస్తున్నారు. ఈ దందాకు చెక్ పెట్టేందుకు కరీంనగర్ పోలీస్ యంత్రాంగం డ్రోన్ కెమెరాలు వినియోగిస్తోంది. డ్రోన్ ల సాయంతో డంప్ లు ఎక్కడున్నాయో కనుగొంటూ స్వాధీనం చేసుకుంటోంది. బాధ్యులపై చర్యలకూ పోలీసులు వెనకాడ్డంలేదు. దీంతో ప్రాంతీయంగా ఇసుకాసురుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇదిలా ఉంటే మానేరు నది తీరప్రాంత గ్రామాల్లోనే ఇసుక డంపులు ఎక్కువగా ఉంటున్నాయి. గ్రామాల్లో పంటపొలాలు, భారీ వృక్షాలు, గుట్టల మాటున ఇసుకను దాచి కొందరు వ్యాపారం సాగిస్తున్నారు. పోలీసులు డ్రోన్ లు వినియోగిస్తుండడంతో రోజులు పదుల సంఖ్యలో అక్రమంగా దాచిన ఇసుక నిల్వలు వెలుగులోకి వస్తున్నాయి.

డ్రోన్ పక్షిలా ఎగురుతూ భూమి మీద వివరాలను రికార్డు చేస్తుంది. ఈ ఫుటేజ్ ను పరిశీలించి ఇసుక డంపులను గుర్తించి సీజ్ చేస్తున్నారు పోలీసులు. పలువురు వాహనాదారులు, కొందరు వ్యాపారులు భారీగా దాచిన ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకుంటున్నారు. భారీ డంపుల వద్ద ఉండే ఇసుక 40 నుంచి 100 లారీలలో తరిలించాల్సి వస్తోంది. సమీపంలోని వాగునుంచి రాత్రి వేళ వాహనాల్లో తరలిస్తుండడం వల్లే ఈ స్థాయిలో ఇసుకను సేకరించారని అధికారులు చెప్తున్నారు. వీలునుబట్టి రహస్యంగా ఈ ఇసుకను వాహనాల్లో తరలిస్తూ విక్రయిస్తున్నారని అంటున్నారు. ఇందుకోసం అక్రమార్కులు పెద్ద మొత్తంలోనే లారీలు సహా ప్రోక్లెయిన్‌లు, జేసీబీ యంత్రాల్ని వినియోగిస్తున్నారని వెల్లడించారు. గడిచిన రెండు నెలల్లో 500లారీల అక్రమ ఇసుకను పోలీసులు పట్టుకున్నారు. పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. నిబంధనల ప్రకారం మూడుసార్లకు మంచి పట్టుబడిన వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తారు. ఈ విషయాన్ని అక్రమార్కులకు స్పష్టం చేసినా వారు తీరు మార్చుకోవడంలేదు. ధనార్జనే ధ్యేయంగా ఇసుక వ్యాపారాన్నికొనసాగిస్తున్నారు. ఇలాంటి వారి ఆగడాలకు పూర్తిస్థాయిలో చెక్ పెడతామని, ఇసుక అక్రమ తవ్వకాలను నిలువరిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Related Posts