YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

భారమైన పశుపోషణ

భారమైన పశుపోషణ

వేసవి తీవ్ర పెరుగుతోంది. ఈ ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఇబ్బందుల్లో పశుగ్రాశం కొరత కూడా ఉంది. ప్రధానంగా కర్నూలు జిల్లాలో పశుగ్రాసం లభ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. దీంతో పశువులకు మేత సంపాదించలేక పోషకులు నానాపాట్లు పడుతున్నారు. మొత్తంగా పశుపోషణ భారంగా మారడంతో వాటిని కబేళాలకు తరలిస్తున్నారు. పశుగ్రాసం ఇచ్చే ప్రధాన పంటలైన వరి, వేరుశనగ, జొన్న వర్షాలు లేక ఎండిపోయాయి. దీంతో జిల్లాలో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. పశువులకు మేత ఇతర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి. రైతులు వరి పంటను కూలీలతో కోత కోయిస్తున్న సమయంలో వరి గడ్డి పశుగ్రాసానికి ఉపయోగపడేది. అయితే రైతాంగం ఇటీవలకాలంలో వరిపంటను యంత్రాలతో నూర్పిళ్లు చేస్తొంది. ఫలితంగా ఈ గడ్డి పశుగ్రాసంగా పనికిరావడంలేదు. జిల్లాలో వాణిజ్య పంటలు పెరిగిపోవడం కూడా సమస్య తీవ్రతను పెంచింది. పశుగ్రాసానికి అవసరమైన వేరుశనగ, జొన్న పంటల సాగు తగ్గిపోవడంతో పశుగ్రాసం కొరత ఏటేటా తీవ్రమవుతోందని పశుపోషకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం పశుగ్రాసం కొరతను నివారించేందుకు గడ్డి పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నా పూర్తిస్థాయిలో ఆచరణలోకి రావడంలేదని అంటున్నారు. 

జిల్లా రైతాంగం ఇటీవలిగా వేసవిలో కూరగాయల సాగువైపు మొగ్గుతోంది. ఆర్ధిక ఇబ్బందులను అధిగమించేందుకు వారు కూరగాయలు సాగు చేస్తున్నాయి. దీంతో గడ్డి పెంపకం విస్తృతంగా చేపట్టడంలేదు. ఇదే జిల్లావ్యాప్తంగా పశుగ్రాసం కొరతను పెంచుతోంది. జిల్లాలో 20 వేల హెక్టార్లలో పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ పశుగ్రాస క్షేత్రాల పెంపకం బాధ్యతలను రైతులకే అప్పగించాలని భావించారు. అయితే పశుగ్రాస క్షేత్రాలను ఎంపిక చేసే ప్రక్రియలో మాత్రం అధికారులు ఉదాసీనంగా వ్యవహిస్తుండడంతో గడ్డి పెంపకం జోరందుకోలేదు. ప్రతి గ్రామంలో పశుగ్రాస క్షేత్రాల పెంపకానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నప్పటికీ అమలు కావడం లేదు. ఇంతవరకు జిల్లాలో ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో పశుగ్రాస క్షేత్రాల పెంపకంపై దృష్టి సారించిన దాఖలాలు లేవని రైతులు, పశుపోషకులు ఆరోపిస్తున్నారు. అందుకే ఈ ఏడాది పశువులకు గ్రాసం కొరత తీవ్రంగా ఏర్పడిందని మండిపడుతున్నారు. రైతులు పశువులకు మేత పెట్టలేక వీటిని కబేళాలకు తరలిస్తున్న పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి పశుగ్రాసం కొరతను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ప్రణాళికలను పక్కాగా అమలు చేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు. ఇక ప్రస్తుత సమస్యకు చెక్ పెట్టేందుకు తాత్కాలికంగా అన్ని గ్రామాల్లో పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఉచితంగా పంపిణీ చేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు.

Related Posts