దేశీయ గోవుల ద్వారా సేకరించే పంచగవ్యాలతో పలు ఉత్పత్తులు తయారు చేయడంపై దృష్టి సారించాలని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సోమవారం ఈవో ఎస్వీ గోశాల, ఆయుర్వేద ఫార్మశీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ గోసంతతి పెంపుదల, అభివృద్ధికి సంబంధించి గుజరాత్‌లోని గోపాల్ భాయ్ సుతారియ ఆధ్వర్యంలో గల బన్సి గిర్ గోశాలలో తీసుకుంటున్న చర్యలను టిటిడి గోశాలలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. వ్యవసాయ క్షేత్రాల్లో వాడేందుకు వీలుగా ఉన్న గోకృపామృతం(గో ఎరువులు) మోడల్‌ను వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళతామన్నారు. పంచగవ్యాలతో తయారు చేసే ధూపం, సబ్బులు, అగరబత్తీలు, పరిశుభ్రతా సామగ్రి లాంటి ఉత్పత్తుల్లో వీలైనన్ని టిటిడి గోశాలలో తయారీకి చర్యలు తీసుకోవాలని ఎస్వీ గోశాల, ఆయుర్వేద ఫార్మశీ అధికారులను ఆదేశించారు. బన్సి గిర్ గోశాల కార్యకలాపాలను పరిశీలించేందుకు టిటిడి అధికారులను పంపుతామని, పంచగవ్య ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇచ్చేందుకు ఆ సంస్థ ప్రతినిధులను పంపాలని వారిని కోరారు.
అనంతరం పంచగవ్య ఉత్పత్తుల తయారీ, ఉపయోగాలు, మార్కెటింగ్ అంశాలపై శ్రీ గోపాల్ భాయ్ సుతారియ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. గిర్ గోవుల పంచగవ్యాల ద్వారా తయారైన క్యాప్సూల్స్, సిరప్‌లు, పౌడర్లు, సబ్సులు, హెయిర్ ఆయిల్, మసాజ్ ఆయిల్, ఫేషియల్ క్రీమ్స్, ఇతర మందుల గురించి తెలియజేశారు.
ఈ సమీక్షలో టిటిడి బోర్డు సభ్యులు గోవిందహరి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో పి.బసంత్‌కుమార్, ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ, ఆయుర్వేద ఫార్మశీ ఇన్‌ఛార్జి డాక్టర్ నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.