YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కమీషన్ కష్టాలు

కమీషన్ కష్టాలు

రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం పంటలకు మద్దతు ధర కల్పిస్తోంది. అంతేకాకప్రాథమిక సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రాల ద్వారా పంట సేకరిస్తూ రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ కేంద్రాలను నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి క్వింటాలుకు రూ.32 చొప్పున కమిషన్‌ను ప్రాథమిక సహకార సంఘాలకు చెల్లించాల్సిఉంది. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. అయితే ఈ కమిషన్ చెల్లింపులో తీవ్ర జాప్యం ఉంటున్నట్లు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు. గతేడాది అక్టోబర్‌లోనే వ్యవసాయ దిగుబడులు సేకరించినా కమిషన్ చేతికి రాలేదని అంటున్నారు. కొనుగోళ్లు సాగి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అందాల్సిన కమీషన్‌ ఇంకా ప్రాథమిక సంఘాలకు చేరలేదని వాపోతున్నారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 82 ప్రాథమిక సంఘాల పరిధిలో 223 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సుమారు లక్షా 50వేల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇక ఐకేపీ ఆధ్వర్యంలో 26 కేంద్రాల ద్వారా 10వేల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఈ కొనుగోళ్లకు దాదాపు రూ.4.83 కోట్ల మేర కమీషన్‌ డబ్బులు అందాల్సి ఉంది. 

కమీషన్ కోసం దాదాపు ఆరు నెలలుగా సంఘాలు పడిగాపులు కాస్తున్నాయి. గత సీజన్‌ పూర్తయి, ఈ యాసంగి సీజన్‌ కూడా దగ్గరపడినా పాత బకాయిలు చెల్లించకపోవడంతో సంఘాల్లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించే రైతులకు ప్రభుత్వం హమాలీ ఛార్జీలను చెల్లిస్తోంది. ఈ చెల్లింపుల్లోనూ అధికారులు ఉదాసీనంగా ఉంటున్నారని రైతులు విమర్శిస్తున్నారు. ఏటా సాగు వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో హమాలీ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని అంటున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం హమాలీ చెల్లిస్తుంది. దీంతో ఈ విషయమై రాష్ట్రప్రభుత్వం, అధికారయంత్రాంగం చొరవ తీసుకుని హమాలీ పెంచేలా చర్యలు తీసుకోవాలని రైతాంగం విజ్ఞప్తి చేస్తోంది. ఇదిలాఉంటే ధాన్యం సేకరించిన సంఘాలకు త్వరితగతిన కమీషన్లు చెల్లించేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. గోనె సంచులు, ఇతర అంశాలపై సంఘాలు సకాలంలో లెక్కలు ఇవ్వకపోవడంతోనే కమీషన్ ఆలస్యమవుతోందని అంటున్నారు. అయితే అధికారుల వాదనపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ధాన్యం సేకరించి దాదాపు ఆరు నెలలు అవుతోందని, కమీషన్ చెల్లింపు లెక్కలు తేల్చేందుకు ఇంతకాలం ఎందుకు పడుతుందని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా తక్షణమే కమీషన్ అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు.

Related Posts