విజయవాడ, జనవరి 12, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పడంపై ఆయన రిట్ పిటీషన్ దాఖలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలి నుంచి వివాదంగానే ఉన్నారు. ఆయన చర్యలు, వ్యవహార శైలి ఒక పక్షానికి అనుకూలంగానే ఉన్నట్లు స్పష్టంగా కన్పించింది. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టి ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు గౌరవం దక్కి ఉండేది. కానీ ఆయన మరోసారి కాలు దువ్వేందుకు సిద్దమవుతున్నారు. నిజానికి పంచాయతీ ఎన్నికలు జరగాలంటే ప్రభుత్వ సహకారం అవసరం. ప్రభుత్వ ఉద్యోగులు సయితం మద్దతు తెలపాల్సి ఉంటుంది. కానీ ఈ రెండు అంశాల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సహకారం లేదనే చెప్పాలి. అయినా ఆయన ఎన్నికలను నిర్వహించాలనే ముందుకు వెళుతున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ సందర్భంగా ఉటంకిస్తున్నారు. ఒకసారి షెడ్యూల్ విడుదలయిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ఎక్కడా ఆగలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. అయినా ఈ వివాదం ఇప్పట్లో తేలేది కాదు. డివిజన్ బెంచ్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సానుకూల తీర్పు వచ్చినా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది. అంటే ఎన్నికల ప్రక్రియలో కాలయాపన అనివార్యమన్నది ఖచ్చితం.మరోవైపు ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికలకు సుముఖంగా లేకపోవడంతో వారు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాయి. న్యాయప్రక్రియ ముగిసే నాటికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం పూర్తవుతుంది. అయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంపై పోరాటం చేయడానికే సిద్దమయ్యారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చివరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పావుగా మారతారనడంలో ఎటువంటి సందేహం లేదు.
మరో 3 నెలలు పదవీ కాలం...
జగన్ సర్కార్ కి ఎందరో శత్రువులు. మరెందరో ప్రత్యర్ధులు. చంద్రబాబు ఏలుబడిలో ఒక్క జగనే గొంతెత్తి వాదించేవారు. బీజేపీ, జనసేన మిత్రులుగా ఉండేవారు. కాంగ్రెస్, వామపక్షాల సౌండ్ కూడా నాడు పెద్దగా వినిపించేది కాదు. అదే జగన్ ముఖ్యమంత్రి అనేసరికి మొత్తానికి మొత్తం విపక్షం ఏకమైపోయింది. ఇక వ్యవస్థలతో కూడా జగన్ సర్కార్ నిత్య పోరాటం చేయడం విధి విచిత్రమే. ఏపీలో ఎన్నడూ లేని విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ప్రభుత్వానికి మధ్య అతి పెద్ద సమరమే సాగుతోంది.రెండు రాజ్యాంగబధ్ధమైన సంస్థల మధ్యన ఉండాల్సింది సహకారం, అహంకారం కానే కాదు. మన రాజ్యాంగ నిర్మాతలు చెప్పింది ఇదే. కానీ ఏపీలో మాత్రం సీన్ వేరుగా ఉంది. అన్నీ తానే అంతా తానే అన్నట్లుగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోంది. ఎన్నికలు ఎపుడు పెట్టాలి. వాయిదా వేయాలి అన్నది పూర్తిగా తన ఇష్టం అన్నట్లుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారని అని వైసీపీ నేతలు గుస్సా అవుతున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీకి మంట పుట్టించే మరో వార్త ఇపుడు ప్రచారంలో ఉంది. అదెంతవరకూ నిజమో కానీ జరిగితే మాత్రం వైసీపీకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చుక్కలు చూపించడం ఖాయమని అంటున్నారు.నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఎంతవరకూ అంటే అంతా చెప్పే మాట ఈ ఏడాది మార్చి 31తో సరి అని. కానీ ఇపుడు మరింతకాలం తన పదవీకాలాన్ని పొడిగించుకోవడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు అన్న ప్రచారం వైసీపీ శిబిరాన్ని కలవరపెడుతోంది. దానికి గల కారణాలు. ఆధారాలతో సహా ఆయన మరో తడవ కోర్టు మెట్లు ఎక్కుతారని కూడా అంటున్నారు. అదేంటి అంటే గత ఏడాది నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అకారణంగా దించేసి చెన్నైకి చెందిన కనగరాజ్ ని రాత్రికి రాత్రి వైసీపీ సర్కార్ ఎస్ ఈసీ కుర్చీలో కూర్చోబెట్టింది. దాని మీద నిమ్మగడ్డ ఎంతో పోరాటం చేస్త తప్ప తిరిగి కుర్చీ దక్కలేదు. ఆ విధంగా ఆయనకు మూడు నెలల పదవీ కాలం నష్టం జరిగింది అని లెక్క తేల్చుతున్నారు.ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంతం చూస్తే ఏపీలో పంచాయతీ ఎన్నికలతో మొదలుపెట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపాలిటీల ఎన్నికలను కూడా నిర్వహించి కానీ రిటైర్ కాను అని చెబుతున్నారులా ఉందంటున్నారు. అందుకోసం ఆయన మరో మూడు నెలల గడువుని కోర్టు నుంచి కోరి మరీ తెచ్చుకుంటారని అంటున్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం మూలంగా తన పదవిలో మూడు నెలల విలువైన టైమ్ కోత పడింది కాబట్టి దానికి బదులుగా తనను మరో మూడు నెలలు కొనసాగించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కనుక కోర్టుకు వెళ్తే తీర్పు ఎలా వస్తుందో మరి. ఆయనకు అనుకూలంగా వస్తే మాత్రం అనుకున్నట్లుగా అన్ని స్థానిక ఎన్నికలు నిర్వహించడం ఖాయమే. ఇది వైసీపీకి భారీ షాకే మరి