త్రిలోకసంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న భక్తులను పలకరించేందుకు బయల్దేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్లాడు. ‘అయ్యా! వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు. విష్ణుభగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా?’ అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని. ‘విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు. నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను,’ అంటూ బదులిచ్చారు నారదులవారు. ‘అయితే స్వామీ! ఈసారి మీరు వైకుంఠానికి వెళ్లినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి’ అని వేడుకున్నాడు ఆ ముని. సరేనంటూ నారదులవారు ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. ‘మిమ్మల్ని చూస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామీ! ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?’ అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుని ముంచెత్తాడు. ‘స్వామి బాగానే ఉన్నారు. నేను మళ్లీ అక్కడికే వెళ్తున్నాను. నీ గురించి ఏమన్నా అడగమంటావా!’ అన్నారు నారదులవారు. ‘అడగడానికి ఇంకేముంది తండ్రీ! ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు’ అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. అలాగేనంటూ నారదులవారు తిరిగి వైకుంఠానికి బయల్దేరారు. వైకుంఠంలో నారదులవారు స్వామిని చూసిన వెంటనే, తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు. ‘నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి. కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ’ అన్నారు విష్ణుమూర్తి. స్వామివారి మాటలు విన్న నారదులవారు అయోమయంలో పడిపోయారు. నిత్యం హరినామస్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏంటి? అన్న ఆలోచనలో మునిగిపోయాడు. నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి. ‘నీ అనుమానం తీరే ఉపాయం ఉంది. నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు, ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని వాళ్లు అడుగుతారు కదా! అప్పుడు ‘ఆయన సూది బెజ్జంలోచి ఏనుగుని పంపిస్తున్నారు’ అని చెప్పు. వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది. ఎవరు గొప్ప భక్తులో!’ అన్నారు స్వామి. విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయల్దేరాడు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నారదులవారిని కుశలప్రశ్నలు అడుగుతూ, పనిలో పనిగా ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు ముని. ‘ఆ ఏముంది! వేలెడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘భలేవారే! సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం. మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు’ అన్నాడు ముని చిరునవ్వుతో. నారదులవారు అక్కడి నుంచి సాగిపోయారు. మరికొంత దూరం వెళ్లాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు. ‘అయ్యా! దయచేయండి! ఎక్కడి నుంచి రాక? ఈ మధ్య కాలంలో వైకుంఠానికి వెళ్లారా? స్వామివారు ఎలా ఉన్నారు?’ అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను. ‘అంతా బాగానే ఉందయ్యా! నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూదిబెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘మంచిది మంచిది. స్వామివారు తల్చుకుంటే సాధ్యం కానిది ఏముంది!’ అన్నాడు భక్తుడు. ‘అదేంటీ! స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా!’ అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు. ‘భలేవారే భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది. ఇదిగో ఈ మర్రి పండుని చూడండి. ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా! ఆ గింజలన్నీ మళ్లీ మర్రి చెట్లుగా మారతాయి కదా! పోనీ అక్కడితో ఆగుతుందా… ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసినదానిలో ఆశ్చర్యం ఏముంది. సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా!’ అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదులవారికి అర్థమైంది. మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసివచ్చింది. భగవంతుడిని పొందాలి అంటే కేవలం భక్తి ఉంటే చాలు
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో