తెలంగాణ ప్రభుత్వం ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ,ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అడ్డుకోవడం ప్రజా స్వామ్యాన్ని ఖునీ చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, శాసనసభాపక్ష ఉపనేత జీవన్ రెడ్డి ఆరోపించారు. శనివారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. శాసన సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడం నా రాజకీయ జీవితంలో ఇంతవరకు చూడలేదు. శాసన సభ లోని వీడియో ఫుటేజీ అందజేస్తామని,అడ్వాకేట్ జనరల్ చెప్తే ఇవ్వకుండా న్యాయస్థానాన్ని దిక్కరించింది ఈ ప్రభుత్వమని విమర్శించారు. కోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ తీర్పు వచ్చి ఇన్ని రోజులు అయినా తీర్పును అమలు చేయడం లేదు ఈ టీఆరెస్ ప్రభుత్వమని అన్నారు. చాలా స్పష్టంగా శాసన సభ్యత్వం రద్దు అయిన సభ్యుల సభ్యత్వాన్ని వెంటనే పునరుద్దరుంచాలని,అన్ని హక్కులు కల్పించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అమలు చేయకపోవడం న్యాయస్థానాన్ని దిక్కరించడం క్రిందకి వస్తుంది. ప్రభుత్వం ఏమైనా పై స్థాయి న్యాయస్థానాన్ని ఆశ్రయించి తీర్పు వచ్చేవరకు,హై కోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసారు. శాసన సభ చేసే చట్టాలను అన్నింటినీ కూడా సమీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు ఉంది. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పును రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ అధికారం కేవలం పార్లమెంటు వ్యవస్థకు మాత్రమే ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధిక్కరించి నిర్ణయాలు తీసుకుంటుందని అయన అన్నారు. హై కోర్ట్ తీర్పును అమలు చేయక పోతే తెలంగాణ లేజిస్లేటర్ సెక్రెటరీ, తెలంగాణ చీఫ్ సెక్రెటరీ గానీ జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని జీవన్ రెడ్డి హెచ్చరించారు.