విజయవాడ, జనవరి 13, ఎలో టెంపుల్ పాలిటిక్స్ హీట్ మరింత పెంచుతుంది బీజేపీ. దేవాలయాలపై దాడులు, మత మార్పిడుల అంశం గళం ఎత్తేందుకు రథ యాత్రకు సిద్దం అవుతుంది కాషాయదళం. రామతీర్థం నుంచి కపిల తీర్థం వరకు రామ రథ యాత్ర పేరుతో పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు కమలనాథులు.జాతీయ నేతలను ఏపీకి రప్పించి పార్టీకి ఊపు తెచ్చే ప్లాన్ సిద్దం చేశారట..ఈ నెల చివరి వారంలో లేదా..వచ్చే నెల మొదటి వారంలో యాత్ర చేపట్టే అవకాశం కనిపిస్తుంది.ఎపి బిజెపి రథ యాత్రకు సిద్దం అవుతుంది. హిందూ మత పరిరక్షణ స్లోగన్ తో రథ యాత్రకు బిజెపి సిద్దం అవుతుంది. కొద్ది రోజుల క్రితం విగ్రహ ధ్వంసంతో తీవ్ర నిరసనలకు కేంద్రం అయిన రామతీర్థం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. విజయనగరం జిల్లాలోని రామతీర్థం నుంచి చిత్తూరు జిల్లాలోని కపిల తీర్థం వరకు యాత్ర జరగనుంది. ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో యాత్రకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. రామ రథయాత్ర పేరుతో వారం నుంచి రెండు వారాల పాటు ఈ యాత్ర ఉండే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో దాడులు జరిగిన దేవాలయాలను సందర్శిస్తూ యాత్ర నిర్వహించేందుకు పార్టీ సిద్దం అవుతుంది.రాష్ట్రంలో రథ యాత్ర పేరుతో విస్తృతంగా పర్యటించాలన్నది బిజెపి ఆలోచన. దేవాలయాల్లో వరుస దాడులు అజెండాగా యాత్ర సాగనుంది. దాడుల విషయంలో ప్రభుత్వ ఉదాసీనతపై యాత్ర ద్వారా నిరసనలు చేపట్టనుంది. రాష్ట్రంలో మత మార్పిడులపై బిజెపి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. రథ యాత్ర ద్వారా ఈ అంశాలపై ప్రజల్లో చర్చ తీసుకు వచ్చే ప్రయత్నం చేయనుంది బిజెపి. రాష్ట్ర అద్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో జరిగే ఈ యాత్ర లో జాతీయ నేతలను కూడా భాగస్వాములను చెయ్యాలన్నది బిజెపి రాష్ట్ర నేతల ఆలోచన. ఈ నెల 17న వైజాగ్ లో బిజెపి కోర్ కమిటీ బేటీ జరగనుంది. ఈ భేటీలో రథ యాత్ర రూట్ మ్యాప్ తో సహా ఇతర అంశాలను చర్చించనున్నారు.ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల ను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం మొదలు పెట్టింది బిజెపి. దేవాలయాల్లో దాడుల విషయంలో సోము నేతృత్వంలో పార్టీ గట్టిగానే పోరాడుతుంది. అంతర్వేధి విషయంలో బిజెపి శ్రేణుల పోరాటం ప్రభుత్వంపై ఒత్తిడి తేగలిగింది. అయితే ఆ తరువాత కూడా వరుస ఘటనలు జరుగుతుండడంతో ఈ అంశాలను ప్రధాన అంజెండాగా చెయ్యాలని బిజెపి భావిస్తోంది. రానున్న తిరుపతి ఉప ఎన్నికల విషయంలో హిందూ మత అంశం ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చేందుకు బిజెపి వ్యూహ రచన మొదలు పెట్టింది. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికలకు మంచి అంజెడా కోసం బిజెపి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిణామాల నేపథ్యంలో రథ యాత్ర ద్వారా ఆ పరిణామాలను రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం మొదలు పెట్టింది భారతీయ జనతా పార్టీ.మొత్తంగా చూసుకుంటే బిజెపి చరిత్రలో అత్యంత పేరున్న రథ యాత్ర పేరుతోనే ఇప్పుడు రాష్ట్ర నేతలు టూర్ ప్లాన్ చేస్తున్నారు. దీన్ని ఎంత సక్సెస్ గా ముందుకు తీసుకు వెళతారో చూడాలి.