గుంటూరు, జనవరి 13
జాతీయ రహదారిని ఆరులైన్లుగా విస్తరించాలన్న యోచన పదేళ్లయినా అమలుకు నోచుకోలేదు. ఈలోగా బైపాస్ ఏర్పాటు చేసేందుకు భూ సేకరణ చేసి గజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం బైపాస్ కోసం రైతుల వద్ద నుంచి సేకరించిన భూమికి పరిహారం అందించినా రాష్ట్ర ప్రభుత్వ వాటా నేటికీ చెల్లించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలోపంతో ఈ దుస్థితి దాపురించింది. రహదారి విస్తరణ, బైపాస్ రెండూ జరగకపోవటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూ, వందలాది మంది మృత్యువాత పడుతున్నారు.జాతీయ రహదారిలో కేవలం 14.50 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆరులైన్లుగా విస్తరించలేదు. గత తొమ్మిదేళ్ల కాలంలో తిమ్మాపురం నుంచి బొప్పూడి శివారు వరకు 310 ప్రమాదాలు చోటు చేసుకుని 128 మంది మరణించారు. 171 మంది క్షతగాత్రులయ్యారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బైపాస్ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని ప్రజలు కోరుతున్నారు.కేంద్ర ప్రభుత్వం 16వ నంబర్ జాతీయ రహదారిని 2009లో ఆరులైన్‌లుగా విస్తరించాలని నిర్ణయించింది. ఈ రహదారి విజయవాడ నుంచి చిలకలూరిపేట వరకు 82.5 కిలోమీటర్ల దూరం ఉంది. వాహనాల సంఖ్య పెరిగిన క్రమంలో ఆరులైన్లుగా విస్తరించాలని 2009 మే 1న కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ నుంచి ఒంగోలు వరకు ఉన్న 68 కిలోమీటర్లు ఆరులైన్లుగా విస్తరించినప్పటికీ, చిలకలూరిపేట నియోజవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం నుంచి చిలకలూరిపేట మండలం బొప్పూడి శివారు వరకు ఉన్న 14.5 కిలోమీటర్ల పరిధిలో మాత్రం కోర్టుకేసుల నేపథ్యంలో ఆరు లైన్లుగా విస్తరణకు నోచుకోలేదు. బైపాస్ ఏర్పాటు చేసేందుకు అనుమతులు లభించి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌ను అందించకపోవటంతో నేటికీ పనులు ప్రారంభించలేదు.నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారి సమీపంలో ఉన్న పారిశ్రామిక వేత్తలు, పట్టణంలోని భవనాలకు చెందిన యజమానులు జాతీయ రహదారిని ఆరులైన్ల విస్తరణకు అంగీకరించలేదు. బైపాస్‌ను ఏర్పాటు చేసేందుకు భూసేకరణకు కేంద్రప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే సన్నచిన్నకారు రైతులు తమ విలువైన భూమిని ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఈ విషయమై 2010లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్డును ఆశ్రయించారు. కోర్టు రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించి బైపాస్‌ను ఏర్పాటు చేయాలని తీర్పు వెలువరించింది. 2016లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రహదారుల సమీపంలో ఉన్న భూములకు ఒక ధర, భవనాలు ఉన్న భూములకు ఒక ధర, రహదారులకు దూరంగా ఉన్న భూములకు మరొక ధరను నిర్ణయిస్తూ(ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరల కన్నా 2.5 శాతం) అధికంగా చెల్లించేందుకు రైతులు అంగీకరించటంతో బైపాస్‌కు రంగం సిద్ధమైంది.నేషనల్ హైవేస్ యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం నుంచి మండల కేంద్రమైన నాదెండ్ల, చిలకలూరిపేట పట్టణం, చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడి మీదుగా 16.38 కిలోమీటర్ల దూరంలో ఆరులైన్ల బైపాస్‌ను ఏర్పాటు చేసేందుకు 650 మంది రైతులకు చెందిన 132.12 ఎకరాల భూమిని సేకరించింది. సంబంధిత భూమిలో సర్వేలు నిర్వహించిన నేషనల్ హైవే అధికారులు సెక్షన్3(డీ) ప్రకారం 12–01–2018న, 31–05–2018న పత్రికల ద్వారా గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లపై అభ్యంతరాలు ఉంటే పరిష్కరించేందుకు 2018 ఆగస్టులో నరసరావుపేట ఆర్డీవో నేతృత్వంలో సమావేశాలు నిర్వహించారు. బైపాస్‌కు భూములు ఇచ్చేందుకు మెజార్టీ రైతులు అంగీకరించారు.కేంద్రప్రభుత్వం బైపాస్ రోడ్‌ను ఏర్పాటు చేసే క్రమంలో రైతులకు అందించే పరిహారంలో కేవలం 25 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కోరింది. బైపాస్ నిర్మాణంలో భూమిని కోల్పోతున్న రైతులకు రూ.223.30 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ. 55.80 కోట్లు అందించాలని కేంద్రప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 4న లేఖరాసింది. అనంతరం అక్టోబర్ 1న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జాతీయ రహదారుల శాఖకు చెందిన అధికారులు మరో విడత లేఖ రాశారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటం గమనార్హం. బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.525.78 కోట్లను కేటాయిస్తూ కేంద్రప్రభుత్వం బిడ్‌లను(టెండర్) గత ఏడాది అక్టోబర్ 22న ప్రకటించింది. బిడ్‌లకు చివరి తేదీగా 17–01–2019న నిర్ణయించారు. నేటికీ రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రైతుల పరిహారం వాటాను చెల్లించకపోవటం ప్రశ్నార్ధకంగా మారింది.