ఏలూరు, జనవరి 13,
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగ అంటేనే ఒక సంబరం... ఆ సంబరంలో కోడి పందేలు వెరీ వెరీ స్పెషల్. ఇప్పటికే పందెం బరుల్లో కత్తులు దూసేందుకు పందెం కోళ్లు నువ్వా నేనా అంటూ పోటికి సిద్ధమయ్యాయి. ఉదయాన్నే రన్నింగ్, స్విమ్మింగ్ చేసి పసందైన విందుతో సంక్రాంతి సమరానికి సై అంటున్నాయి. కోర్టు తీర్పు, పోలీసుల హెచ్చరికలు ఎన్ని ఉన్న లెక్కచెయ్యడంలేదు పందెం నిర్వహకులు. సంక్రాంతి సమీపిస్తుండడంతో పందెం బరులను సిద్ధం చేసే పనిలో నిర్వహకులు బిజిగా ఉంటే... కోట్ల రూపాయలు పందెలు వేసే కోడి పుంజులకు శిక్షణ ఇస్తూ ఇంకా బిజీగా మారిపోయారు పెంపకెదారులు. ఆ విషయాలేంటో చూసేద్దాం...పందెం కోడి.. సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఉభయ గోదావరి జిల్లాల్లో అందరి నోటా వినబడే పేరు అనడంలో సందేహం లేదు. నిజం చెప్పాలంటే కోడి పందేల చరిత్ర ఈనాటి కాదు. అనాదికాలం నుండి శాస్త్రాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. సంక్రాంతి వేళ కోడికి కత్తి కడితే కనక వర్షమే అనే సామెత పాతదైనా.. అందులో సత్యం ఎంత ఉందనే విషయం మాత్రం అనుమానమే. ఎందుకంటే వినోదం కోసం నిర్వహించే కోడి పందేలు వేరు.. డబ్బు కోసం ఆడే కోడి పందేలు వేరు. మొదటి దాని వలన ఎలాంటి నష్టమూ లేదు. కానీ రెండవ దాని వల్లే కాపురాలు కూలిపోయే పరిస్థితులు తలెత్తవచ్చు. నేడు కోడిపందేల పేరుతో బెట్టింగ్ అనేది సాధారణమైపోయింది. అయినా కోడిపందేలు ఒక సంప్రదాయానికి చిహ్నం.సంప్రదాయం పేరుతో సాగే కోడిపందేలలో డబ్బే పరమావధిగా మారింది. తరతరాలుగా వస్తున్న పందేలలో పాటించే నీతికి ఎప్పుడో తిలోదకాలిచ్చారు. కాలికి కట్టిన కత్తితో ప్రత్యర్థి పుంజును చిత్తు చేయగలిగిన పుంజునే విజయం వరించడం న్యాయం. అయితే, ఇప్పుడు త్వరగా పందేలు పూర్తిచేసేందుకు, అడ్డదారుల్లో గెలిచేందుకు కత్తులకు విషరసాయనాలు పూసేందుకు కొందరు పూనుకుంటున్నారు. అలాగే బరిలో దిగే కోళ్లకు స్టెరాయిడ్స్, పెయిన్‌కిల్లర్లు ఇష్టానుసారం వినియోగిస్తున్నారు. పందెంలో రెండు అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఒకటి కోడి జాతి. రెండు దానికి ఇచ్చే శిక్షణ. తెలుగు రాష్ట్రాల్లో కాకి, సేతువ, నెమలి, కౌజు, డేగ, పర్ల వంటి రకాలకు ఆదరణ ఎక్కువ. ఈ కోళ్లన్నీ దాదాపు అసీల్ జాతికి చెందినవి. రెక్కల రంగు, ఇతర శారీరక లక్షణాల ఆధారంగా వీటిని వర్గీకరిస్తారు. అయితే పచ్చకాక, కాకినెమలి జాతి కోడిపుంజులకు ధరలు ఎక్కువ. విజయం సాధించడంలో అవి దూకుడుగా వ్యవహరిస్తాయని భావిస్తారు. జాతి బట్టే కోడి పుంజుల ధరలు ఉంటాయి.తెలుగు రాష్ట్రాల్లో కోడి పందేలకి బాగా ప్రసిద్ధి చెందింది తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు. దాదాపుగా జిల్లాలో 50వేలకు పైగా కోళ్లు పందేనికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా పాలకొల్లు, ఆచంట, నరసాపురం, భీమవరం, ఉండి, దెందులూరు, ద్వారకాతిరుమల, వెంప, ముమ్మిడివరం, కాకినాడ రూరల్, ఐ.పోలవరం, మొగల్తూరు, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం లాంటి ప్రాంతాల్లో ప్రధానమైన పందెం కోళ్ల తయారీ కేంద్రాలున్నాయి. పండగ సీజన్ వచ్చిందంటే ఆ కోళ్లకు ప్రత్యేక ట్రీట్ మెంట్ ఇస్తారు. ఇంట్లో వాళ్లల సొంత మనుషుల్లా వాటిని సాకుతారు. జీడి పప్పు, బాదం పిస్తా లాంటి బలవర్ధకమైన ఆహారాన్ని అందించి వాటిని పందేనికి సిద్ధం చేస్తారు. ఉదయం ఆరు గంటల నుండి ఈ పందెం కోళ్లకు ట్రైనింగ్ మొదలు పెడతారు... ముఖ్యంగా మంచు ఎక్కువుగా ఉంటే ఈ పందెం కోళ్లను గూటిలో నుండి బయటకు రానివ్వరు... ఎనిమిది గంటల లోపు వాకింగ్ చేయించి ఈత కొట్టిస్తారు... అలా ఈత కొట్టిన కోళ్లను కొంత సేపు ఎండలో కడతారు...ఈత కొట్టించడం వల్ల పందెం కోళ్లలో ఆయాసం రాకుండా ఉంటుంది... దాదాపుగా ఒంటిగంట సమయం దాటినా తర్వాత వేడి నీళ్లతోనూ, వేడి చేసిన ఆయిల్తోనూ కోడికి మర్దనా చేస్తారు... అలా చేయడం వల్ల పందెం కోళ్లలో చలాకీతనం రావడంతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా పోయే అవకాశం ఉంటుంది..... సాయంత్ర అయిదు నుండి ఆరు గంటల మధ్య ఈ కోళ్లను గూటిలోకి పంపించేస్తారు.పందెంకోళ్ల చూడటానికే ప్రత్యేకంగా కనిపిస్తాయి. మిగిలిన కోళ్లతో వీటిని కలవనీయరు. పందెం కోళ్ల పెంపకం తపస్సులా చేస్తారు. కన్నబిడ్డలకన్నా ప్రేమగా పుంజులను పెంచేవాళ్లూ ఉన్నారు. సాధారణ కోడిపుంజులకన్నా పందెం పుంజులు ఎత్తుగా, దృఢంగా ఉంటాయి. రంగురంగుల ఈకలతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ప్రతి కోడికి బాదం పిక్కలను పెడతారు... దీనితో పాటు ఉడకబెట్టిన గుడ్లను ఆహారంగా అందిస్తారు... , వేట మాంసం కీమా పెడతారు... కీమాతో పాటు జీడిపప్పును కూడా అందిస్తారు. ఇక మరికొంతమంది పందెం రాయుళ్లు కోళ్లకు మద్యాన్ని కూడా పట్టించి పందేం సమయానికి బలంగా తయారు చేస్తారు. పందెం కోళ్లకు ఇచ్చే ఆహారం కూడా ప్రత్యేకమైనదే. వీటికి సోళ్లు, సజ్జలు, మటన్ కైమా, పచ్చసొన తీసివేసిన కోడిగుడ్లు, రెవిటాల్ టాబ్లేట్లు, 18 రకాల దినుసుల లేహ్యం తినిపిస్తారు. ఒకేచోట నిలబెట్టడం వలన కాళ్లల్లో శక్తి దెబ్బతింటుందని నెట్ కట్టి పుంజును అటూ.. ఇటూ తిప్పుతారు. ఒక విధంగా పుంజుకు వాకింగ్ చేయిస్తారు. కొవ్వు పట్టకుండా వేడి నీళ్లల్లో వేప, జామ, వెదురు ఆకులు, పసుపులను కలిపి మరగపెట్టి బాలింతకు నీళ్లు పోసినట్లు తడిసిన గుడ్డ కొడి చుట్టూ తిప్పి గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయిస్తారు. పుంజు కొద్దిగా నీరసించినట్లు కనిపించినా..మెడను కదపలేక మేతను తినలేకపోయినా..తక్షణమే వైద్యం చేయిస్తారు. శుభ్రమైన నీటిని మట్టిపాత్రలోనే అందిస్తారు. ఒక్కో కోడికి 5వేల నుండి 25 వేల వరకు ఖర్చు అవుతుంది.. కోడి రంగును బట్టి, జాతిని బట్టి ఒక్కో పందెం కోడి ధర 10వేల నుండి లక్ష రూపాయల వరకు పలుకుతుంది... ఇంత ధర ఉన్న కోళ్లను పది లక్షల నుండి కోటి రూపాయల వరకు పందాలు వేయడానికి తీసుకువెళ్తారు. పందేనికి వెళ్లే కోళ్లకు కూడా ఒక శాస్త్రం ఉంది అంటే నమ్ముతారా.... కానీ పందెం రాయుళ్లు మాత్రం ఆ శాస్త్రాన్ని చూసుకుని మంచి ముహూర్తం పెట్టించుకుంటే కానీ పందేనికి వెళ్లరు. శతాబ్దాల కాలం నుండి గోదావరి వాసులు తమ పౌరుషానికి ప్రతీకగా సంక్రాంతి రోజుల్లో కుక్కుట శాస్తాన్ని అనుసరిస్తూ కోడి పందాలను నిర్వహిస్తున్నారు. కోడికి ఎప్పుడు కత్తి కట్టాలి? ఏ రోజు పందేనికి మంచి ముహూర్తం? అవతలి వ్యక్తి పేరు బట్టి పందేనికి ఏ దిక్కున నిలబడాలి? ఆ రోజు ఉన్న నక్షత్రం ఏంటి? ఏ వైపు కోడిని పందేనికి నిలబెట్టాలి? ఇలాంటివన్నీ కూడా కుక్కుట శాస్త్రం లో చూసి అప్పుడు పందేనికి దిగుతారు పందెం రాయుళ్ళు. అంతే కాదండోయ్ పందెం లోకి దిగడానికి ముహూర్తం చూసుకుంటారు ఒకవేళ ముహూర్తం దాటితే పందెం నుంచి వెనక్కి వచ్చేస్తారు. ఏంటి కోడి పందేలకి ఇంత చూస్తారా అనుకుంటున్నారా.... కేవలం సంక్రాంతి మూడు రోజుల్లోనే వందల కోట్లు చేతులు మారతాయి. మరి అన్ని కోట్ల మీద పందేలు కడుతుంటే ఆ మాత్రం జాగ్రత్త పడరా. కోళ్ళల్లో రకాలను బట్టి పందేలు కాస్తారు. ముందుగ అందరూ తమ తమ కోళ్ళను తీసుకుని ఊరి పొలిమేరల్లో సిద్దం చేసిన బరులు దగ్గరకి వస్తారు. బరి నిర్వహించే వాళ్ళకి కొంత అద్దె చెల్లించుకోవాలి. ముందుగ రెండు కోళ్ళను కత్తి కట్టకుండా ఒకదాని మీద ఇంక్కో దాన్ని రెచ్చగొడతారు. ఆ తరువాత పందెం ఎంత ఏంటి అనేది మాట్లాడుకుని అప్పుడు కత్తి కట్టి బరిలోకి దింపుతారు. ఒక్కోసారి కోళ్ళు 30 నిముషాలు పోరాడతాయి. ఒక వైపు రక్తం కారుతున్న లెక్క చెయ్యకుండా పోరాడతాయి. మధ్యలో కోడిని వెనక్కి తీసి నోట్లో నీళ్ళు పుక్కిలించి మసాజ్ చేసి మళ్ళి ఉసిగోల్పుతారు. అలా చచ్చేదాకా పోరాడి చివరకి ఎవరో ఒక ప్లేటులో ముక్క అవుతుంది.పందెంలో ఓడిపోయిన కోడిని అవతలి పోటిదారుకి ఇచ్చేయ్యల్సిందే. బ్రతికున్నప్పుడే కాదు చచ్చిపోయిన కోడికి మంచి గిరాకి ఉంటుంది. ఇలా చచ్చిపోయిన కోడిని అక్కడి ప్రాంత వాసులు కోస అని పిలుచుకుంటారు. ఇది మాములు కోడి మాంసం కన్నా రుచిగా ఉంటుంది అందుకే ఈ కోస రేట్ ఎక్కువ. ఇక చనిపోయిన కోడిని అక్కడే మాంసంగా అమ్ముతారు. దీనిని కొనేందుకు ఎంత రేట్ అయిన వెనుకాడకుండా కొంటారు మాంసప్రియులు. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహించొద్దని కోర్టు స్పష్టం చేసినా, పోలీసులు అనుమతులు లేవని హెచ్చరించినా బరులు సిద్ధం చేసారు. రాజకీయ నాయకుల అండదండలతో పందేలకి సిద్ధమయ్యారు. కోట్లాది రూపాయలు చేతులు మారతాయని... కోళ్లకు గాయలవుతాయని కోడి పందేలని నిషేధించాలని పలువురు కోరుతున్నారు. సంక్రాంతికి కోడి పందేలను నిర్వహించొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కోడిపందేలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో పోలీసులు మొదట చర్యలు తీసుకున్నారు.కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ఉన్న పందెం కోళ్లను సీజ్ చేశారు. కోడిపందేలు నిర్వహిస్తారని అనుమానం ఉన్న కొందరిని ముందస్తుగా బైండోవర్ చేశారు. కోడి పందేల నిషేధంపై కోర్టు తీర్పును గోదావరి సాంప్రదాయ పరిరక్షణ సమితి నాయకులు సుప్రీం కోర్టులో సవాల్ చేసారు. కోడిపందెలకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టరాదని స్పష్టం చేసింది. అలాగే కోళ్ల పందెంలో జూదం, డబ్బులు పెట్టడం లాంటివన్నీ కుదరదని తేల్చి చెప్పింది. అంతేకాదు, కోళ్లను హింసించే ఎలాంటి చర్యలనూ ఉపేక్షించేది లేదని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు విస్పష్టంగా ఉన్నా.. అవి ఎక్కడా అమలు అవుతున్నట్లు కనిపించడం లేదు. సంక్రాంతి సందర్భంగా ఏపీలోని కోస్తా ప్రాంతంలో యథేచ్ఛగా కోడిపందెలు జరుగుతున్నాయి. కోడి కాళ్లకు కత్తు కట్టి, డబ్బులు పెట్టి పందెం కాస్తున్నారు. మొదట్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలతో హడావుడి చేసిన పోలీసులు ఇప్పుడు కోళ్లపందెల బరుల దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. కోర్టు తీర్పు పాటిస్తామంటూనే.. సంప్రదాయాన్ని ఎలా వదులుకుంటామని ప్రశ్నిస్తున్నారు. కోడిపందేలు తరతరాలుగా వస్తున్న సంప్రదాయం అని, దాన్ని ఎలాగైనా కొనసాగిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం కోడి పందాలు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తుండటంతో కోళ్లను పెంచే వాళ్ళు కూడా భయపడుతున్నారు... పోలీసులు కూడా పందెం నిర్వాహకులపైనే కాకుండా కోళ్లను అమ్మే వారిపైనా, కత్తులు అమ్ముతున్న, కత్తులు కడుతున్న వాళ్లపైన బైండవర్ కేసులు పెడతామని హెచ్చరించడంతో కొంత కోళ్లను అమ్మడానికి భయపడుతున్నారు. ఒక పక్క పోలీసులు పహారా కాస్తున్నా, పందేలు నిర్వహించొద్దని కోర్టు ఆంక్షలు పెట్టిన పందెం రాయుళ్లు మాత్రం సై అంటున్నారు. ఏడాదికి మూడురోజులు సరదాగా చేసుకునే పందేలను నిషేధించడం భావ్యం కాదని, ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా పందేలు నిర్వహించి తీరాతామని స్పష్టం చేస్తున్నారు.