అనంతపురం, జనవరి 13,
ఆ స్టేషన్ లో నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు. కానీ అభివృద్ధి అమడ దూరంలో ఉంటుంది. గుంతకల్లు డివిజన్ అభివృద్ధి పట్టాలు ఎక్కేదీ ఎన్నడు అనేది మాత్రం ప్రశ్నార్థకం మారింది.రైల్వే బడ్జెట్ లో గుంతకల్లు రైల్వే డివిజన్ నుంచి రూ.244 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చారు. ముఖ్యంగా ట్రాఫిక్, ప్రయాణికుల సదుపాయాలు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాన రైల్వే స్టేషన్స్ లో ఫూట్ ఓవర్ బ్రిడ్జి, ప్లాట్ ఫాంలు ఎత్తులేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రధానంగా డివిజన్ అధికారులు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, రైల్వే ప్లాట్ ఫాం ఎత్తు పెంపునకు ప్రతిపాదనలు పంపారు. ఇందులో గుంతకల్లు డివిజన్ లో ప్రయాణికుల సదుపాయాల్లో భాగంగా ప్లాట్ ఫాంలు ఎత్తు పెంచటం, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లు , కోచింగ్ ఇండికేషన్స్ బోర్డులు వంటి అభివృద్ధి పనులకు గాను 215 కోట్ల రూపాయలు, 64 డీ అండ్ ఈ కేటగిరి రైల్వే స్టేషన్ లలో హై లెవల్ ప్లాట్ పాంలు, మరో 56 రైల్వేస్టేషన్ లలో ప్లాట్ ఫాంల విస్తరణ కు 110 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపారు. డివిజన్ లోని శెట్టిగుంట, ఎర్వేడు, నిదిగాల్లు, కడప, కోడూరు, హద్దినగుండు, వీరపురం, బేవణహల్, ముర్రచెట్టాల్, చేగుంట రైల్వేస్టేషన్ లలో స్టేషన్ బిల్డింగ్ నిర్మాణాలకు, ఆధునికరణకు రూ.10 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. గుంతకల్లు, ధర్మవరం, గుత్తి, ఆదోని, డోన్, మంత్రలయం, పాకాల రైల్వేస్టేషన్ లలో అత్యాధునిక రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ స్పెషిపీకేషన్ కోచ్ ఇండికేషన్ బోర్డులు, ట్రైన్ ఇండికేషన్ బోర్డుల ఏర్పాటుకు 10కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపారు. ప్రయాణికుల సదుపాయాలు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు, అదే విధంగా గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్నప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఆర్థిక రైల్వే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్టు గుంతకల్లు డివిజన్ అధికారులు చెబుతున్నారు.