హైదరాబాద్, జనవరి 13,
తెలంగాణలో వచ్చేనెల నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలని తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఆయా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలను నడిపి మేలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని ఆ శాఖ భావిస్తోంది. దీని ప్రకారం 20–21 సంవత్సంలో పాఠశాలలు కేవలం 65–70 రోజులే పనిచేస్తాయి. బడికి రావాలంటే లిఖీతపూర్వకంగా తల్లిదంద్రుల అంగీకారం తప్పనిసరి చేశారు. భౌతికదూరం నేపథ్యంలో ఒక్కో తరగతి గదిలో కేవలం 20 మంది విద్యార్థులకే అనుమతిస్తారు.ఫిబ్రవరి, మార్జి ఏప్రిల్ మూడు నెలలు కలిపి 89 రోజులు కాగా, వాటిలో ప్రభుత్వ సెలవులు, ఆదివారాలు తీయగా మిగిలేవి 70 రోజులు మాత్రమే. అయితే.. రెండో శనివారం కూడా తరగతులు కొనసాగుతాయి. ఇంట్రెన్స్, అడ్మీషన్స్, ఇంటర్ పరీక్షలతో ముడిపడి ఉంటాయి కాబట్టి ఆ పరీక్షలను ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. మే 24 తర్వాత జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఉంటాయి. ఇంటర్ పరీక్షలు పూర్తవ్వగానే పది పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం పదికి ఆరు పరీక్షలే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తరగతులకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉండి, సౌకర్యాలు తక్కువ ఉంటే షిఫ్ట్ విధానంలో కూడా పాఠశాలలు నడపవచ్చు. ఉదయం 10వ తరగతి, మధ్యాహ్నం 9వ తరగతికి పాఠాలు బోధించవచ్చని అధికార యంత్రాంగం తెలిపింది.
25కు సిద్ధం కావాలి
ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో స్కూళ్లు,కాలేజీలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి… విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్ సాంకేతిక, కాలేజీ విద్యాశాఖల కమిషనర్ ననీన్ మిత్తల్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు.కరోనా రూల్స్ పాటిస్తూ విద్యాసంస్థలు నిర్వహించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు ఈనెల 25 వరకు రెడీగా ఉండాలని తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. విద్యాసంస్థల నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 1న విద్యా సంస్థలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో 9,10, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల నిర్వహణకు తరగతుల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఈ నెల 20లోగా నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.విద్యా సంస్థల్లో బోజన సదుపాయాల ఏర్పాటుకుగానూ బియ్యం, పప్పు, ఇతర ఆహార ధాన్యాలను జిల్లా కలెక్టర్లు సమకూరుస్తారని మంత్రి తెలిపారు. జిల్లా, మండల విద్యాధికారులు అన్ని స్కూళ్లను ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన చర్యలను చేపట్టాలన్నారు. వివిధ సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు, కాలేజీలను పూర్తి స్థాయిలో రెడీ చేసేందుకు ఈ నెల 18న ఆయా స్థానిక మంత్రులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ గైడ్ లైన్స్ ను ప్రైవేట్ విద్యా సంస్థలు కచ్చితంగా పాటించాలని ఈనెల 18న ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.