న్యూఢిల్లీ జనవరి 13
దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలను తిరిగి ప్రారంభించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. దేశంలోని కంటైన్‌మెంట్ జోన్‌ల వెలుపల అంగన్‌వాడీ కేంద్రాల పునఃప్రారంభంపై జనవరి 31లోగా నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అయితే కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు విపత్తు నిర్వహణ అధికారులను సంప్రదించిన తర్వాత మాత్రమే అంగన్‌వాడీ కేంద్రాలను తెరువడానికి ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం షెడ్యూల్ 2 ప్రకారం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. పిల్లలకు, తల్లులకు పోషక సాయం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లతోపాటు తల్లులకు, గర్భిణిలకు ప్రభుత్వం పోషక ఆహారాన్నిఅందిస్తున్నది. అయితే కరోనా కారణంగా గత మార్చిలో ఈ అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో వాటిని తిరిగితిరిచే అంశంపై కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.