న్యూ ఢిల్లీ జనవరి 13
అమెరికాకు చెందిన లీసా మాంట్‌గోమోరి అనే మహిళకు ఇవాళ మరణశిక్ష అమలు చేశారు. విషపూరిత ఇంజక్షన్ ఇచ్చి ఆమెకు శిక్ష అమలయ్యేలా చేశారు. ఇండియానాలోని టెర్రీ హాట్ జైలు కాంప్లెక్స్‌లో తెల్లవారుజామున 1.31 నిమిషాలకు మరణశిక్ష అమలైంది. గత ఏడాది జూలై నుంచి ప్రాణాంతక ఇంజక్షన్ ఇచ్చి చంపినవారిలో ఆమె 11వ ఖైదీ కావడం విశేషం. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన హయాంలోనే మరణశిక్షలను అమలు చేయడం మొదలుపెట్టారు. దాదాపు 17 ఏళ్ల నుంచి ఒక్కర్నీ కూడా అమెరికా జైల్లలో ఇంజక్షన్ ఇచ్చి చంపలేదు. కానీ గత ఏడాది నుంచి ఈ శిక్షలను అమలు చేస్తున్నారు. 1953 తర్వాత ఓ మహిళా ఖైదీకి మరణశిక్ష అమలు చేయడం అమెరికాలో ఇదే మొదటిసారి. వాస్తవానికి లీసా మరణంపై అమెరికా కోర్టు మంగళవారం 24 గంటల స్టే విధించింది. 2004లో ఓ గర్భిణిని చంపి.. ఆమె కడుపులో ఉన్న శిశువుతో లీసా పరారైంది. ఆ కేసులో దోషిగా తేలిన లీసాకు మరణశిక్ష ఖరారైంది. లీసా మానసిక ఆరోగ్యం సరిగా లేదని జడ్జి ప్యాట్రిక్ హన్లాన్ నిన్న మరణ శిక్ష అమలును నిలిపివేశారు. గత 67 ఏళ్లలో ఓ మహిళకు ఖరారైన మరణశిక్షను ఆడ్డుకోవడం తొలిసారి. కానీ 24 గంటల స్టే తర్వాత ఆమెకు ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాలు తీశారు.