విజయవాడ జనవరి, 13
ఓ వైపు పోలీస్ ఆంక్షలు..మరోవైపు పందెం కోళ్ల సవాళ్లతో ఉభయ గోదావరి జిల్లాలో పండుగ సందడి మొదలైంది. కోడి పందాలపై అంక్షలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నా.. పందెం రాయుళ్లు పట్టించుకోవటం లేదు. సంక్రాంతి సంబరం అంబరాన్నంటేలా కోళ్లను గూళ్లలోంచి బయటకు తీసి ఊళ్లు దాటిస్తున్నారు. కొబ్బరితోటల్లో మకాల వద్దా, మామిడితో పుల్లోనూ రొయ్యల చెరువు కట్టలపైనా ఇప్పుడు కోళ్లన్నీ బరుల్లో భారీ ఫైట్‌కు సిద్ధమవుతున్నాయి. ఆంక్షల పేరుతో పోలీసులు బరులు గీసిన వారి భరతం పడుతున్నారు. కోడి పందాలు నిర్వహించాలనుకున్న పందెం రాయుళ్ల ఆశలపై కృష్ణా జిల్లా పోలీసులు నీళ్లు చల్లారు. పందెం రాయుళ్లకు చెక్ పెట్టారు. కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామ శివారులోని మామిడి తోటలో కోడి పందాల కోసం ఏర్పాటు చేసిన బరులను ట్రాక్టర్‌తో ధ్వంసం చేశారు . నందిగామ రూరల్ సర్కిల్ పరిధిలో ఇప్పటివరకు కోడిపందాలకు సంబంధించి 21 కేసుల్లో 42 మందిని బైండోవర్ చేసినట్లు పోలీసులు చెప్పారు. పందాలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
అటు తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలు షురూ అయ్యాయి. పర్మిషన్‌లేకున్నా పక్కాగా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. అమలాపురం, రాజమండ్రి, ఏజెన్సీ ప్రాంతాల్లో యధేచ్చగా కోడిపందాలు కొనసాగుతున్నాయి. పోలీసుల ఆదేశాలను నిర్వహకులు తుంగలోకి తొక్కేసి కోళ్ల పందాలను ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో సాంప్రదాయ కోడి పందాల చాటున పేకాట, గుండాట నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయనేతల ఒత్తిడి కారణంగా పోలీసులు చేతులెత్తేశారని పలువురు విమర్శిస్తున్నారు.మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలోనూ కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి.ఉండి నియోజకవర్గంలో స్ధానిక ప్రజా ప్రతినిదులు ఈ కోడి పందాలను ప్రారంభించారు.క్రిష్ణాజిల్లాలోనూ పందెం రాయుళ్లు కోడి కత్తులతో పందెం కోళ్లను బరిలోకి దింపారు.దీంతో లక్షలాది రూపాయలు రాయుళ్ల చేతులు మారుతూ ఈ సారి కూడా ఎన్ని ఆంక్షలు పెట్టినా పందాలు మాత్రం ఆగడం లేదు.