జనవరి 13,
కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్ టీకా రాష్ర్టానికి చేరుకుంది. మొత్తం 3.64 లక్షల డోసులు తెలంగాణకు చేరుకోగా, వాటిని నేటి నుంచి జిల్లాలకు తరలిస్తున్నారు. జనవరి 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి దశలో భాగంగా తొలుత ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు, ఆ తర్వాత ప్రాధాన్యక్రమాన్ని అనుసరించి టీకాలు వేస్తారు. మొదటి దశలో ఎవరికైతే టీకా ఇవ్వాలనుకున్నారో వారికి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందజేస్తారు.
ఎస్ఎంఎస్ అందుకున్న వారే టీకాకు అర్హులవుతారు.
వ్యాక్సిన్ ఇచ్చే ముందు సదరు వ్యక్తికి జ్వరం ఉందా? లేదా? అని పరీక్షిస్తారు.
జ్వరం లేకపోతే ఆ వ్యక్తి పేరు, ఇతర వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్ వేసేందుకు అనుమతిస్తారు.
టీకా వేసిన తర్వాత సదరు వ్యక్తిని 30 నిమిషాల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతారు.
ఈ సమయంలో స్వల్పంగా జ్వరం ఉన్న అక్కడున్న వైద్యులు మేనేజ్ చేస్తారు.
ఒక వేళ టీకా తీసుకున్న వ్యక్తికి ఇతర సమస్యలు ఉత్పన్నమైతే, అతన్ని తక్షణమే ప్రత్యేక చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తరలిస్తారు.
ప్రతి వ్యాక్సిన్ సెంటర్ వద్ద సీనియర్ డాక్టర్లు అందుబాటులో ఉంటారు.
టీకా కేంద్రాల్లో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
కొవిడ్ టీకాను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామ సమయం ఉంటుంది.
40 ప్రైవేటు, 99 ప్రభుత్వ కేంద్రాల్లో టీకాలు
వ్యాక్సిన్ పంపిణీచేసే కేంద్రాల్లో 6 ప్రైవేటు టీచింగ్ దవాఖానలు ఉండగా, 34 ప్రైవేటు దవాఖానలు ఉన్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలోని 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 15 యూపీహెచ్‌సీలు, 21 సీహెచ్‌సీలు, 12 ఏరియా దవాఖానలు, 20 జిల్లా దవాఖానలు, 6 ప్రభుత్వ టీచింగ్ దవాఖానల్లో వ్యాక్సినేషన్ నిర్వహించనున్నారు. ఇక గాంధీ మెడికల్ కాలేజీ, నార్సింగ్ ఆర్‌హెచ్‌సీలో నిర్వహించే ప్రక్రియను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిలకించి, వ్యాక్సినేటర్లు, లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. మిగతా 137 కేంద్రాల్లోని సిబ్బంది, లబ్ధిదారులు ప్రధాని కార్యక్రమాన్ని తిలకించేలా ఇంటర్నెట్, టీవీ సౌకర్యాలను అధికారులు కల్పించనున్నారు.
వ్యాక్సిన్ సరఫరా ఇలా..
కోఠిలోని స్టేట్ వ్యాక్సిన్ స్టోర్ నుంచి కరోనా వ్యాక్సిన్లు జిల్లా కేంద్రాలకు తరలిస్తారు. తొలుత ఉమ్మడి వ్యాక్సిన్ స్టోర్ కేంద్రాలకు, అక్కడినుంచి జిల్లా కేంద్రాలకు, వ్యాక్సిన్ బూత్‌లకు సరఫరా కానున్నాయి. మొత్తంగా 900 కోల్డ్‌చైన్ స్టోరేజ్ కేంద్రాలకు తరలిస్తారు. ఈనెల 16న 139 (40 ప్రైవేటు, 99 ప్రభుత్వ) కేంద్రాల్లో 13,900 మంది హెల్త్ కేర్ వర్కర్లకు టీకాలు వేయనున్నారు. ఈనెల 17వ తేదీ ఆదివారం సెలవు తర్వాత 18 నుంచి మొత్తం 1,213 సెంటర్లలో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. వారంలో బుధ, శనివారాలు మినహా మిగిలిన నాలుగు రోజులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొవిడ్ టీకాలు వేయనున్నారు. బుధ, శనివారాల్లో పిల్లలకు వేసే సార్వత్రిక టీకాల కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయా కేంద్రాల్లో వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై సంబంధిత అధికారులు, సిబ్బందికి శిక్షణ సైతం పూర్తిచేశారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ పుట్ట రాజు పర్యవేక్షిస్తున్నారు.