YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

వివాదాల్లో 9 వేల ఎకరాలు

వివాదాల్లో 9 వేల ఎకరాలు

హైదరాబాద్, జనవరి 15, 
ప్రభుత్వ భూములకు సంబంధించి వివిధ కోర్టుల్లో వివాదాలు నడుస్తున్నాయి. ఆ కేసులను గెలవాలని సిఎం కెసిఆర్ ఆదేశాల నేపథ్యంలో వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూముల జాబితాను సిద్ధం చేసి కేసుల పరిష్కారానికి అధికార యంత్రాంగం సమాయత్తం అవుతోంది. ఇప్పటికే సిఎం కెసిఆర్ ఉన్నతాధికారులతో పాటు సంబంధిత అధికారులతో ఈ విషయమై సమావేశమై ప్రభుత్వ భూములకు సంబంధించి చర్చించినట్టుగా తెలిసింది. అందులో భాగంగానే ప్రభుత్వ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లకూడదని, ఆ భూములకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయడంతో అన్ని రకాలుగా ఆ భూములు ప్రభుత్వానికి దక్కేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని సిఎం ఆదేశించినట్టుగా సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కోర్టులతో పాటు ఎండోమెంట్ కోర్టుల్లో ఉన్న కేసులపై దృష్టి సారించాలని సిఎం సూచించినట్టుగా తెలిసింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు కోర్టుల్లో 8,289.62 ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించిన కేసులు వివిధ కోర్టుల్లో మగ్గుతున్నాయి. వీటి విలువ సుమారుగా రూ.60 వేల కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా కోర్టుల్లో భూ వివాదాలకు సంబంధించిన కేసుల సంఖ్య 789 ఉండగా, అధికంగా హైకోర్టులోనే 545 కేసులు నడుస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 831.62 ఎకరాల భూమికి సంబంధించి వివిధ కోర్టుల్లో 83 కేసులు నడుస్తున్నాయి. నగర శివారులోని మేడ్చల్ జిల్లాలో వివాదాలకు సంబంధించిన భూములు 7,458 ఎకరాలు ఉండగా వీటిలో వివిధ కోర్టుల్లో 706 కేసులు కొనసాగుతున్నాయి. వివాదాల్లో ఉన్న హైదరాబాద్ జిల్లా పరిధిలోని భూముల విలువ రూ.9,489.16 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే మేడ్చల్ జిల్లా పరిధిలోని వివాదాస్పద భూములు 7,458 ఎకరాలకు సంబంధించి రూ.26 వేల కోట్లకు పైగా ఉంటుందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివాదాస్పద భూములకు సంబంధించిన వివరాలను కొత్త రెవెన్యూ చట్టానికి ముందే రెవెన్యూ అధికారులు నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందచేశారు. కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం కోర్టు కేసుల్లో ఉన్న భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేసింది. అయితే ప్రస్తుతం ఈ భూముల వివరాలను ఏ దశలో ఉన్నాయన్న సమాచారాన్ని సిఎం కెసిఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నట్టుగా తెలిసింది. భూ వివాదాలకు సంబంధించిన కోర్టు కేసుల స్టేటస్‌పై త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆయన అధికారులను ఆదేశించినట్టుగా సమాచారం. కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు కోర్టు కేసుల్లో నడుస్తుండడంతో ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించుకోలేక పోతున్నామని, అందరినీ సమన్వయం చేసుకొని భూ వివాదాలను పరిష్కరించుకోవాలని సిఎం కెసిఆర్ అధికారులకు సూచించినట్టుగా తెలిసింది.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం భూములు 2.75 కోట్ల ఎకరాలుండగా పట్టా భూములు 1.50 కోట్ల ఎకరాలు, అటవీ భూములు 60 లక్షల ఎకరాలు, ప్రజా అవసరాలకు సంబంధించిన భూములు 65 లక్షల ఎకరాలు ప్రభుత్వ సంస్థలు, రహదారులు, మౌలిక సదుపాయాలు, గ్రామకంఠం, నదులు, పట్టణాలు సేకరించిన భూములున్నాయి. అందులో దేవాదాయ భూములకు సంబంధించి 87,235 ఎకరాలకు గాను అందులో 21వేల ఎకరాలు లీజుకు ఇవ్వగా, అర్చకుల ఆదీనంలో 23 వేల ఎకరాలు, ఆక్రమణలో 22,535 ఎకరాలుండగా దీనిపై వివిధ కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. అన్ ఫిట్ ఫర్ కల్టివేషన్‌లో 19 వేల ఎకరాల భూమి ఉందని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.77,588 ఎకరాల వక్ఫ్‌భూములు ఉండగా అందులో 57,423 ఎకరాల భూమి ఆక్రమణకు గురయ్యింది. ఇప్పటికే 6,938 మంది ఆక్రమణదారుల్లో 6,074 మంది ఆక్రమణదారులకు నోటీసులు అందించడంతో పాటు 2,186 మందిపై ప్రభుత్వం కేసులను నమోదు చేసింది. ప్రస్తుతం 967 మంది కేసులు కొనసాగుతున్నాయి.వీటితో పాటు రాష్ట్రంలో 55.67 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని గతంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇందులో వ్యవసాయానికి యోగ్యం కానివి 13.8 లక్షల ఎకరాలుండగా ఇక ప్రజోపయోగ అవసరాలకు కేటాయించిన 16,288 ఎకరాల భూములు వృథాగా ఉన్నాయని ఈ కమిటీ తన నివేదికలో పేర్కొంది. అత్యంత విలువైన ప్రాంతంగా పేర్కొనే రంగారెడ్డి జిల్లాలో 10,852 ఎకరాలు, మెదక్‌లో 2,042 ఎకరాలు, హైదరాబాద్‌లో 189 ఎకరాల భూమి ఉన్నట్టుగా టాస్క్‌ఫోర్స్ కమిటీ పేర్కొంది. ప్రస్తుతానికి రూ.7,852 కోట్ల విలువైన 4,752 ఎకరాల ప్రభుత్వ భూమి 3 జిల్లాలో కేంద్రీకృతమై ఉందని ఆ కమిటీ ప్రాథమికంగా తేల్చింది. ఈ నేపథ్యంలో ఈ భూములను పరిశ్రమలతో పాటు ప్రజలకు ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సిఎం ఆదేశించినట్టుగా తెలిసింది.

Related Posts