కరోనా వైరస్ నియంత్రణ కోసం భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మెచ్చుకున్నది. మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పరిణామాలను భారత్ ఎదుర్కొన్న తీరును కూడా ఆ సంస్థ ప్రశంసించింది. ఆర్థిక వ్యవస్థ దూకుడుగా మారేందుకు భారత ప్రభుత్వం మరింత చేయూతనివ్వాలని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలీనా జార్జీవా తెలిపారు. గురువారం జరిగిన రౌండ్‌టేబుల్ భేటీలో ఆమె మాట్లాడారు. అయితే రాబోయే వరల్డ్ ఎకనామిక్ అప్‌డేట్‌లో భారత్ ర్యాంకు మెరుగుపడనున్నట్లు ఆమె చెప్పారు. కరోనా సంక్షోభ వేళ భారత్ తీసుకున్న చర్యలు ఆ దేశానికి మేలు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. జనరివ 26వ తేదీన వరల్డ్ ఎకనామిక్ ర్యాంక్‌లు విడుదలవుతాయని, వాటిల్లో భారత్ స్థానం మెరుగ్గా ఉంటుందని, ఎందుకంటే ఆ దేశం మహమ్మారి వేళ తీసుకున్న చర్యలు అమోఘం అని ఆమె అన్నారు. అంత భారీ జనాభా ఉన్న దేశం అకస్మాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించడం ఆశ్చర్యకరమన్నారు.
టార్గెట్ ఆంక్షలు, లాక్‌డౌన్‌తో భారత్‌లో వైరస్ నియంత్రణ కట్టుదిట్టంగా సాగిందని, వృద్ధి రేఖలను పోలిస్తే, కోవిడ్ కన్నా ముందు భారత్ ప్రగతి ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉందని ఐఎంఎఫ్ చీఫ్ తెలిపారు. ఆర్థిక, ద్రవ్యపరపతి విధానాల బలోపేతం కోసం భారత ప్రభుత్వం అద్భుత చర్యలు తీసుకున్నట్లు క్రిస్టలీనా తెలిపారు. మార్కెట్లు అసాధారణ రీతిలో కోలుకుంటున్నాయని, ప్రభుత్వం ఒకవేళ మరిన్ని చర్యలు తీసుకుంటే, భారత్ ఇంకా దూసుకు వెళ్తుందని ఆమె అన్నారు.