YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని, వచ్చే నెల 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతారని లోక్‌సభ సచివాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరగనుండగా.. తొలి దశలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, మలి దశలో మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు సమావేశాలు జరుగుతాయి. లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు ప్రతి రోజూ నాలుగు గంటల చొప్పున సాగనున్నాయి. వివిధ స్టాండింగ్ కమిటీలు, మంత్రిత్వ శాఖలు, విభాగాల నిధుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవడానికి, వారి నివేదికలను సిద్ధం చేయడానికి సమావేశాలను వాయిదా వేయనున్నారు. లోక్‌సభ సాయంత్రం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు, రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయి. గతంలో జరిగిన వర్షాకాల సమావేశాలు మాదిరిగానే కరోనా నిబంధనలకు అనుగుణంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
సభ ప్రారంభం రోజే రాష్ట్రపతి ఉభయ సభల నుంచే ప్రసంగించనున్నారు. కోవిడ్ పరిస్థితి కారణంగా ఆర్ధికంగా దెబ్బ తిన్న తర్వాత దేశం తిరిగి వృద్ధి పథంలోకి రావాలని చూస్తున్నతరుణంలో 2021-22 సంవత్సరానికి కేంద్రం రాబోయే బడ్జెట్ ప్రకటనపైనే  అందరి దృష్టి ఉంది. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వంపై వ్యయం ఎక్కువగా పడింది. ప్రస్తుతం వ్యాక్సిన్ తయారీకి భారీగా ఖర్చు చేయాలని చూస్తోంది. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని, కరోనా వైరస్ సెస్ లేదంటే సర్‌చార్జిని ప్రవేశ పెట్టే ప్రణాళికపై కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లు సమాచారం. అయితే దేశంలో అధిక ఆదాయాన్ని సంపాదించేవారికి కొవిడ్ -19 సెస్, సర్‌చార్జీని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జీఎస్టీ వసూళ్ళు భారీగా తగ్గాయి. దాంతో ఇప్పుడు ప్రభుత్వం రాబడులు పెంచుకునేందుకు మార్గాలను వెతుకుతోంది. ఇందులో భాగంగానే సంపన్నులపై సెస్‌, సర్‌చార్జి వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Posts