YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సి ఎం చేతుల మీదుగా కామధేను పూజ - సాంప్రదాయ బద్దంగా పూజ చేసిన సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

సి ఎం చేతుల మీదుగా కామధేను పూజ  -  సాంప్రదాయ బద్దంగా పూజ చేసిన సిఎం  వైఎస్ జగన్మోహన్ రెడ్డి

కనుమ పండుగ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు గుంటూరు జిల్లా నరసరావుపేట లో శుక్రవారం  నిర్వహించిన కామధేను పూజ (గోపూజ) లో  ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
         
పంచకట్టు, కండువతో కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి ఆ ప్రాంగణంలోని గోమాతలు, నందీశ్వరులు( ఎద్దు) అలంకరణలు చూశారు. అనంతరం గో పూజకు గోత్ర నామాలతో ఆయన సంకల్పం చేసుకున్నారు. వేద పండితులు, అర్చకుల వేద మంత్రాల నడుమ జగన్మోహన్ రెడ్డి గోమాతకు, దూడకు పట్టు వస్త్రాలు, పూలమాలలు, పసుపు కుంకుమ సమర్పించి హారతి ఇచ్చారు. గోమాత, దూడ కు ఆయన ప్రదక్షిణ చేసి నమస్కరించారు. టీటీడీ అర్చకులు సి ఎం ను శేష వస్త్రం తో సత్కరించారు. ఇస్కాన్ ప్రతినిధులు శాలువతో సత్కరించి జ్ఞాపిక ను అందించారు. స్థానిక శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రిని గజమాలతో సన్మానించారు.


      ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. గోపూజ వల్ల రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

కామధేను పూజ కార్యక్రమంలో  టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి,రాష్ట్ర మంత్రులు శ్రీమతి  మెకతోటి సుచరిత,శ్రీ  వెల్లం పల్లి శ్రీనివాస రావు, డిప్యూటి స్పీకర్ శ్రీ కోన రఘుపతి, ఎంపీ శ్రీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు,  టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో  ఏవి ధర్మారెడ్డి, జెఈవో  పి బసంత్ కుమార్, సివిఎస్వో  గోపీనాథ్ జెట్టి, కలెక్టర్  శ్యా మ్యూల్ ఆనంద్, ఎస్పీ  విశాల్ గున్ని, గుంటూరు జిల్లాకు చెందిన పలువురు శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

 రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ
  
హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో గోపూజ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ సహకారంతో  టీటీడీ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని 2679 ఆలయాల్లో ఉదయం 11.50 గంటలకు శాస్త్రోక్తంగా గోపూజ కార్యక్రమమాలు నిర్వహించారు.

Related Posts