ఇసుక మాఫియా.. మట్టి మాఫియా.. ఇలా మాఫియాల పేరుతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నాయి. అక్రమంగా ఇసుక, మట్టి దందా రాజ్యమేలుతున్నారు. మరోవైపు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు జిల్లా మహానంది మండలం గాజుల పల్లె గ్రామ సమీపంలో ఉన్నఎర్రమట్టిని అక్రమంగా కొందరు దుండగులు తరలిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ ఎర్ర మట్టిని ఇటుకల బట్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. యథేచ్ఛగా తరలిస్తున్న వీటిపై అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉన్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు ఈ మట్టి కోసం అక్రమార్కులు పక్కన ఉన్న పంట పొలాలను కూడా నాశనం చేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట కళ్లెదుటే నాశనం అవుతుందని అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు. మట్టి తరలించే వాహనాలు గ్రామం గుండూ అధిక వేగంతో వెళుతుడంతో ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్థులు ఆందోళన పడుతున్నారు. మట్టి కోసం పక్క పొలాల్లో 5 నుంచి 10 అడుగుల వరకు మట్టి తవ్వుతుంటే... పొలాలు పనికి రాకుండా పోయి... పండించాడనికి కూడా రాకుండా పోతున్నాయి. నల్లమల ఫారెస్ట్ అనుకుని బంజరు భూములు...అంకిరెడ్డి చెరువులో ఈ మట్టి మాఫియా అక్రమంగా మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు.అధికారుల అండదండలతో రెచ్చిపోతున్న ఈ ఆక్రమార్కుల ఆగడాలను అరికట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అదే విధంగా పొలాలు నాశనం అవుతున్నా పట్టించుకోని అధికారులను నిలదీసి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న మాఫియాపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలువురు కోరుతున్నారు.