ప్రజాస్వామ్యం అంటేనే మార్పునకు మూలం అని చెప్పాలి. ఒకటి కంటే ఎక్కువ అవకాశాలు ఉంటే జనం కచ్చితంగా వాటి వైపు మొగ్గు చూపుతారు. తమకు నచ్చినది ఎంచుకుంటారు. ఒకే పార్టీని, ఒకే నాయకుడిని శాశ్వతంగా కుర్చీలో కొలువు ఉంచడానికి ఇది నియంతృత్వం కానే కాదు. మరి ఈ సంగతులు అపర చాణక్యుడు, రాజకీయ గండర గండడు చంద్రబాబుకు తెలియనివి అని ఎవరైనా అనుకోగలరా. ఆయన మాత్రం గత ఇరవై నెలలుగా నన్నెందుకు ప్రజలు ఓడించారు అంటూ ఒకటే బాధ పడిపోతున్నారు.తాను ఏ తప్పూ చేయలేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం అయిదేళ్ళ పాటు కష్టపడి పనిచేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. అయినా జనాలు తనను ఓడించేశారని ఆయన తెగ మధన పడుతున్నారు. కాసేపు చంద్రబాబు చెప్పినదే నిజం అనుకున్నా కూడా తప్పు చేయకపోతే ఎప్పటికీ చంద్రబాబే ముఖ్యమంత్రి అని రాజ్యాంగం లో ఏమైనా రాశారా. మంచి పనులు చేసిన వారు ఎందరో ఎన్నో ఎన్నికల్లో ఓడిపోయారు. నిజానికి తప్పు చేస్తే ఓటమి తగిన శిక్ష అన్న థియరీ కూడా రాజకీయాల్లో నూరు శాతం వర్తించదు. చంద్రబాబు బాగా పాలించి ఉండొచ్చు. అయినా యువకుడు కొత్త నాయకత్వం అని జగన్ కి ఒక సారి అవకాశం ఇవ్వవచ్చు. అలా చంద్రబాబు ఎందుకు అనుకోలేకపోతున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న.ఈ దేశంలో 130 కోట్లకు పైగా జనాభా ఉంది. కానీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలుపుకుని అయిదేళ్లకు ప్రజలు ఎన్నుకునే ప్రజా ప్రతినిధులు వేలల్లోనే ఉంటారు. మరి మిగిలిన వారికి సమర్ధత లేదనా. లేక వారికి అగ్ర సింహాసనాలు వద్దనా. ప్రజా స్వామ్యం సూత్రం ప్రకారం అందరూ సమానమే. నాయకుడు అంటే అందరి కంటే ఒక అడుగు ముందు ఉన్నవాడే తప్ప అధికుడు మాత్రం కాదు. కాబోరు. ఆ విధంగా ఆలోచిస్తే కోట్ల జనాభాలో టీడీపీ తరఫున చంద్రబాబుకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. దానికి తనకు ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకోకుండా తాజాగా టీడీపీని ఓడించిన జనాలకు వివేచన లేనట్లుగా చంద్రబాబు మాట్లాడడమే దారుణం. 2019 ఎన్నికలలోఆయన ఓడిన తరువాత ఇప్పటికి కొన్ని వందల సార్లు ప్రజల వివేకం మీద విమర్శలు చేయడం బాధాకరమే కాదు తప్పు కూడా.చంద్రబాబు 1999లో రెండవమారు సీఎం కాగానే విజన్ 2020 అన్నారు. అంటే అప్పటిదాకా తానే సీఎంగా ఉండాలని ఒక దురూహతోనే అలా చెప్పారనుకోవాలి. ఇక 2014లో నవ్యాంధ్రకు తొలి సీఎం కాగానే విజన్ 2050 అన్నారు. అంటే తానూ తన కొడుకు, మనవడు ఇలా తామే ఏపీని గుత్తకు తీసుకుని పాలించాలన్నది చంద్రబాబు ఆలోచన కావచ్చు. ఆయన స్వార్ధం ఆయనకు ఉంటే జనాలు తమ ఆలోచనలతో తీర్పు ఇచ్చారని ఎందుకు అనుకోకూడదు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పెట్టి ఏడేళ్ళుగా పోరాడుతున్నారు. మరి ఆయనకు కూడా సీఎం కుర్చీ మీద మోజు ఉండదా. బీజేపీ ఏపీ మీద కన్నేసింది. ఆ పార్టీ నుంచి చాలా మంది నాయకులు చాన్స్ వస్తే సీఎం కావాలని చూస్తున్నారు. జగన్ దిగిపోతే మళ్లీ నేనే అని చంద్రబాబు ఎలా అనుకుంటారు. సీఎం కుర్చీ అన్నది ఈ ఇద్దరికే పరిమితమైన పోరాటం కాదు కదా. ఏది ఏమైనా చంద్రబాబు తన ఫ్లాప్ షోను ఫ్లాష్ బ్యాక్ ని మరచి ముందుకు సాగకపోతే టీడీపీకి మరిన్ని ఇబ్బందులు తప్పవన్నది మేధావుల మాట