దేశంలోని ఏటీఎంలలో నగదు కొరత కేంద్ర ప్రభుత్వానికి తలపోటు వ్యవహారంగా తయారైంది. దేశ వ్యాప్తంగా కరెన్సీ కష్టాలు నానాటికి తీవ్రం అవుతున్నాయి. ఏటీఎంలను జనం విసుగెత్తి కొన్నిచోట్ల బద్దలు కొట్టేస్తున్నారు. మరికొన్ని చోట్ల బ్యాంకులలో సిబ్బందితో రోజు యుద్ధానికి దిగడం సర్వసాధారణం అయిపొయింది. పరిస్థితి తీవ్రతను ఎట్టకేలకు కేంద్ర ఆర్ధిక శాఖ గుర్తించింది. రిజర్వ్ బ్యాంక్ సైతం తాజా స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించింది. అసలు ఇంత దారుణ పరిస్థితులకు కారణాలను అంతా అన్వేషించారు. తగిన నగదును ఏటీఎంలలో ఉంచే చర్యలకు ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు.నగదు కస్టాలు ఇలాగే కొనసాగితే తాము విధుల్లో కొనసాగలేమని బ్యాంకర్లు స్పష్టం చేసేసారు. దాంతో సర్కార్ సీరియస్ గా దృష్టి పెట్టింది. ఆదాయపు పన్ను విభాగం రంగంలోకి దిగింది. సమస్య మూలలను పరిశీలించడం మొదలు పెట్టింది. దీనితో బాటు కేంద్ర ఆర్థికశాఖలోని ఉన్నతాధికారులు విచారణ మొదలు పెట్టారు. దేశంలో నిత్యం 6 వేల కోట్లరూపాయలనుంచి 7 వేలకోట్లరూపాయల వరకు నగదు ఏటీఎం లనుంచి డ్రా అవుతుంది. అలాంటిది గత కొద్దిరోజులుగా 9వేలకోట్లరూపాయల వరకు ఖాతాదారులు విత్ డ్రా చేస్తూ ఉండటంతో కొరత ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా తెలంగాణ, బీహార్ నగదు కొరత ను తీవ్రంగా ఎదుర్కొంటున్నట్లు తేల్చారు. అధికారుల లెక్కల ప్రకారం బీహార్ లోని ఏటీఎం లలో 61 శాతం మాత్రమే ఏటీఎం లలో కరెన్సీ అందుబాటులో వుంది. అదే తెలంగాణలోని ఏటీఎం లలో 73 శాతం కరెన్సీ లభిస్తున్నట్లు గుర్తించారు.కరెన్సీ కొరత లేకుండా దేశంలోని అన్ని ఏటీఎం లలో నగదు నింపే చర్యలను ఆర్బీఐ స్వయంగా చేపట్టింది. ఎక్కడా నగదు లేదు అనే మాట లేకుండా పూర్తి స్థాయిలో నిల్వలు ఏర్పాటు చేసేలా చూడాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. మరి ఇప్పటికైనా కరెన్సీ కస్టాలు తీరుతాయోలేదో చూడాలి.