పెద్దల మాట చద్దన్నం మూట అనే సామెత. వృద్ధులే సమాజానికి మార్గదర్శకులు. వారి అనుభవాలు జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. అలాంటి వయోవృద్దుల కోసం పరవాడ మండలం జీ.వీ.ఎం.సీ 79 వార్డు దేశపాత్రుని పాలెంకు చెందిన ఓ కుటుంబం విశ్రాంతి గృహాన్ని నిర్మించింది. కీర్తిశేషులు నగిరెడ్డి వెంకటస్వామి,ఆదమ్మ దంపతుల జ్ఞాపకార్ధంగా దేశపాత్రునిపాలెం మెయిన్ రోడ్డులోని ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీ లచ్చమాంబ విశ్రాంతి నిలయాన్ని నగిరెడ్డి అప్పారావు చేతులమీదుగా ప్రారంభించారు. దివంగత నగిరెడ్డి సత్యారావు కుమారుడు సూర్యప్రకాశరావుతో పాటు అతని అన్నదమ్ములు నగిరెడ్డి అప్పారావు, అచ్చారావు, వెంకటరమణలు విశ్రాంతి నిలయాన్ని ఏర్పాటు చేసి పెద్ద మనసు చాటుకున్నారు. వృద్ధులు విశ్రాంతి తీసుకుంటూ ఆనందంగా సేదదీరేందుకు వీలుగా ఈ రెస్ట్ హౌస్ నిర్మించామని నగిరెడ్డి కుటుంబీకులు తెలిపారు. ఎన్నో జీవితాలను తీర్చిదిద్దిన వృద్ధులను ఆదుకోవడం సామాజిక బాధ్యతని అన్నారు. ఈ విశ్రాంతి నిలయాన్ని ఏర్పాటు చేసిన నగిరెడ్డి వారసులకు పలువురు సీనియర్ సిటిజెన్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.