నాలుగు తిట్లు తిడితే కానీ మీడియాలో కవరేజ్ రాని పరిస్థితి. ఇది ఇప్పుడు సామాన్యులకు మాత్రమే కాదు సెలబ్రిటీలకు వర్తిస్తుంది. ఈ పల్స్ పట్టేశారో ఏమో తెలియదు కానీ చంద్రబాబు బామ్మర్ది ఎన్టీఆర్ తనయుడు లోకేష్ మామ గారు బాలకృష్ణ హాట్ డైలాగ్స్ తో హల్చల్ చేశారు. చంద్రబాబు చేపట్టిన ఒకరోజు ధర్మపోరాట దీక్షలో బాలయ్య హైలెట్ గా నిలిచారు. అది తన విమర్శలతో. ప్రధాని మోడీని థర్డ్ జెండర్ తో పోల్చారు బాలకృష్ణ. ఇక అక్కడితో ఆగలేదు. ఒక దశలో నటుడు శివాజీ తొడకొట్టమంటే కొట్టారు. సామ,దాన, భేద ఉపాయాలు పూర్తి అయ్యాయని దండోపాయం మాత్రమే మిగిలిందన్నారు. ఇది గుజరాత్ కాదని, ఆంధ్రప్రదేశ్ లో మోడీ ఆటలు సాగవని హెచ్చరికలు పంపారు. అది కూడా హిందీలో డైలాగ్స్ కొట్టి మరీ చెప్పారు.బాలకృష్ణ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దాంతో సీన్లోకి బిజెపి నేతలు దిగిపోయారు. చెడా మడా బాలయ్యను ఉతికేశారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం ఏమిటంటూ దాడి చేశారు. తక్షణం ప్రధాని మోడీకి భేషరతుగా క్షమాపణలు చెప్పి తీరాలని కమలనాధులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించారు. హిందీ రాకుండా ఆ భాషలో మాట్లాడాలని ప్రయత్నం చేయడాన్ని బిజెపి ఎద్దేవా చేసింది. మీకు రాజకీయాల్లో ఎలా మాట్లాడాలో తెలియదని వెళ్ళి సినిమాలు చేసుకోండి అంటూ ఎగతాళి చేసింది. ఆ పార్టీకి చెందిన విష్ణుకుమార్ రాజు ఈ అటాకింగ్ లో ఉంటే, రాజమండ్రి ఎమ్యెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ మరింతగా బాలయ్యపై విరుచుకుపడ్డారు. ఎదుటివారిని బాలకృష్ణ గౌరవించడం నేర్చుకోవాలని సంస్కారహీనుడు, విషయపరిజ్ఙానం లేని వ్యక్తిగా ఆయన దుమ్మెత్తిపోశారు. మొత్తానికి బావ కళ్ళలో ఆనందం కోసం పాపం బాలయ్య అనే పరిస్థితికి ఆయన వెళ్ళిపోయారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.