ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మొదటివిడతలో వ్యాక్సినేషన్, రాష్ట్రవ్యాప్తంగా 332 వ్యాక్సిన్ సెషన్స్ సైట్లలో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ మొదటి విడత కార్యక్రమాన్ని విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ముందుగా ముఖ్యమంత్రి వ్యాక్సినేషన్ ప్రక్రియను, సాంకేతిక అంశాలను పరిశీలించారు. తొలి టీకాను జిజిహెచ్ శానిటేషన్ సిబ్బంది బి. పుష్పకుమారికి వైద్యులు వేశారు, మరో హెల్త్‌వర్కర్ (నర్స్) సి. హెచ్. నాగజ్యోతికి కూడా ముఖ్యమంత్రి సమక్షంలో వ్యాక్సిన్ ఇచ్చారు. అనంతరం కోవిడ్ 19 టీకాపై వైద్య, ఆరోగ్యశాఖ రూపొందించిన పోస్టర్‌ను సీఎం ఆవిష్కరించారు. అంతకుముందు టీకా వేయించుకునేవారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సీఎం స్వయంగా పరిశీలించారు. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో 3.87 లక్షల మందికి తొలిదశలో వ్యాక్సిన్ వేయనున్నారు.
ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్, మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాద్ దాస్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, కోవిడ్ 19 టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం.టి. కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్, స్ధానిక ప్రజాప్రతినిధులు, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.